Stock Market: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. వరుసగా ఎనిమిదో రోజూ నష్టాలే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:45 PM
వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు భారీగా పతనమవుతున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. డాలర్ విలువ రోజురోజుకూ పెరిగిపోతుండడం కూడా మదుపర్లకు భయాందోళనలను కలిగిస్తోంది.

భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు భారీగా పతనమవుతున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. డాలర్ విలువ రోజురోజుకూ పెరిగిపోతుండడం కూడా మదుపర్లకు భయాందోళనలను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా ఎనిమిదో రోజు కూడా సూచీలకు నష్టాలు తప్పలేదు. (Business News)
గురువారం ముగింపు (76, 138)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 250 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా కోల్పోయి 75, 439 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. అయితే చివరి గంటలో కాస్త కోలుకుంది. చివరకు 199 పాయింట్ల నష్టంతో 75, 939 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఉదయం 22, 800 కంటే కింద పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. చివరకు 102 పాయింట్ల నష్టంతో 22, 929 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో శ్రీ సిమెంట్స్, జుబిలెంట్ ఫుడ్స్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్ప లాభాలను ఆర్జించాయి. దీపక్ నైట్రేట్, లారస్ ల్యాబ్స్, మనప్పురం ఫైనాన్స్, కల్యాణ్ జువెల్లర్స్ భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1227 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.82గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..