Stock Market: అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:46 PM
అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావొచ్చని, దాంతో బాండ్ల మీద రిటర్న్స్ పెరిగి విదేశీ మదుపర్లు భారత్ వంటి దేశాల నుంచి నిధులను మరింతగా ఉపసంహరించుకుంటారని ప్రముఖ బ్రోకరేజి సంస్థ నోమురా అంచనా వేసింది. ఈ విశ్లేషణలు, రూపాయి పతనం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల నుంచి కోలుకోనివ్వడం లేదు.

విదేశీ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావొచ్చని, దాంతో బాండ్ల మీద రిటర్న్స్ పెరిగి విదేశీ మదుపర్లు భారత్ వంటి దేశాల నుంచి నిధులను మరింతగా ఉపసంహరించుకుంటారని ప్రముఖ బ్రోకరేజి సంస్థ నోమురా అంచనా వేసింది. ఈ విశ్లేషణలు, రూపాయి పతనం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల నుంచి కోలుకోనివ్వడం లేదు. సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి (Business News).
గత శుక్రవారం ముగింపు (75, 311)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చాలా రోజుల తర్వాత 75 వేల దిగువకు పడిపోయింది. చివరి దశలో ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో దాదాపు వెయ్యి పాయింట్లు కోల్పోయి 74, 387 దగ్గర సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 856 పాయింట్ల భారీ నష్టంతో 74, 454 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 242 పాయింట్ల భారీ నష్టంతో 22, 553 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో వరుణ్ బేవరేజెస్, అబాట్ ఇండియా, లారస్ ల్యాబ్స్, బాటా ఇండియా షేర్లు లాభాలను ఆర్జించాయి. నేషనల్ అల్యూమినియం, ఇన్ఫో ఎడ్జ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్473 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.69గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..