Upcoming IPOs: వచ్చే వారం ఐపీఓల జాతర.. 6 లిస్టింగ్‌లు, 7 సబ్‌స్క్రిప్షన్లు..
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:21 PM
వచ్చే వారం ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. అలాగే ఆరు సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాబోతున్నాయి. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న ఏడింటిలో మూడు మెయిన్ బోర్డ్ నుంచి కాగా, మరో నాలుగు ఎస్‌ఎమ్‌ఈ విభాగం నుంచి రాబోతున్నాయి.

కొత్త సంవత్సరం మొదటి వారంలోనే స్టాక్ మార్కెట్ల (Stock Market)లో ఐపీఓల (IPO) జాతర మొదలైంది. వచ్చే వారంలో మార్కెట్ నుంచి నిధులను సమీకరించేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. అలాగే ఆరు సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాబోతున్నాయి. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న ఏడింటిలో మూడు మెయిన్ బోర్డ్ నుంచి కాగా, మరో నాలుగు ఎస్‌ఎమ్‌ఈ (SME) విభాగం నుంచి రాబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం (Business News).
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ..
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జనవరి 6న ప్రారంభమై 8న ముగిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు గ్యాస్ లైనింగ్ పరికరాలు, సంక్లిష్ట పరికరాలను తయారు చేసి అందిస్తుంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి 410.05 కోట్ల రూపాయలను సమీకరించబోతోంది. ఒక్కో షేర్ ధరల శ్రేణి రూ.133-రూ.140గా ఉండబోతోంది.
క్యాపిటల్ ఇన్‌ఫ్రా..
క్యాపిటల్ ఇన్‌ఫ్రా ఐపీఓ జనవరి 7న మొదలై 9న ముగుస్తుంది. ఇన్‌ఫ్రా రంగంలో పని చేస్తున్న ఈ కంపెనీ 1578 కోట్ల రూపాయల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఒక్కో షేర్ ధరల శ్రేణి రూ.99-రూ.100గా సంస్థ నిర్ణయించింది.
క్వాడ్రంట్ ఫ్యూచర్..
క్వాడ్రంట్ ఫ్యూచర్ ఐపీఓ జనవరి 7న మొదలై 9న ముగుస్తుంది. భారత రైల్వేలకు చెందిన కవచ్ ప్రాజెక్ట్ కింద అధునాతన సిగ్నలింగ్, కంట్రోల్ వ్యవస్థ కోసం ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి రూ.290 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేర్ ధరల శ్రేణి రూ.275-290 మధ్య నిర్ణయించారు.
పై మూడు మెయిన్ బోర్డ్ నుంచి పబ్లిక్ ఇష్యూకు వస్తుండగా, ఎస్‌ఎమ్‌ఈ విభాగం నుంచి ఇండోబెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ (ఒక్కో షేర్ ధర రూ.46), బీఆర్ గోయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (షేర్ ధరల శ్రేణి రూ.128-135), డెల్టా ఆటోక్రాప్ లిమిటెడ్, అవాక్స్ అపెరల్స్ అండే ఆర్నమెంట్ లిమిటెడ్ (ఒక్కో షేర్ రూ.70) సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. అలాగే వచ్చే వారం మొయిన్ బోర్డ్ నుంచి ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ షేర్లు జనవరి 7న మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. ఇక, ఎస్‌ఎమ్‌ఈ విభాగం నుంచి టెక్నికెమ్ ఆర్గానిక్ లిమిటెడ్ (జనవరి 7), లియో డ్రైఫ్రూట్స్ అండ్ స్పైసెస్ (జనవరి 8), పరమేశ్వర్ మెటల్ (జనవరి 9), ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ క్లీన్‌రూమ్ (జనవరి 10) వచ్చే వారం ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
మరన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..