Share News

లవ్‌ యూ నాన్న

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:21 AM

నేడు ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా మీ తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..? చిన్న పిల్లలిచ్చే చిరు కానుకైనా నాన్నకు కలిగే సంతోషం చెప్పలేనంత. టీనేజీలో ఉంటే...

లవ్‌ యూ  నాన్న

నేడు ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా మీ తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..? చిన్న పిల్లలిచ్చే చిరు కానుకైనా నాన్నకు కలిగే సంతోషం చెప్పలేనంత. టీనేజీలో ఉంటే.. డాడీ ఇచ్చే పాకెట్‌ మనీతో గిఫ్ట్‌ కొని ఆయన్ని సంబుర పెట్టవచ్చు. ఇప్పటికే ప్రయోజకులై, సంపాదిస్తుంటే మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించండి. మీ జీవితానికి సుస్థిర బాట వేసిన నాన్న భవిష్యత్‌కు ఆర్థిక భరోసా కల్పించే కానుక అందించడం మేలు.

ఆరోగ్య బీమా

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరగడం సాధారణం. కానీ, ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది. దేశంలో వైద్య ఖర్చులు ఏటా 14 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఓ సర్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా మీ నాన్న ఆరోగ్యానికి బీమాతో ధీమా కల్పించండి. మీ నాన్న పేరిట హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు చేయడం మేలు. మీ తండ్రి గారికి ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటే వాటికీ బీమా కవరేజీ లభించేలా పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ తండ్రి వయసు 50-60 ఏళ్లు పైబడితే, క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్యాల ఖర్చులకూ కవరేజీ కల్పించే క్రిటికల్‌ ఇల్‌నెల్‌ పాలసీని తీసుకోవడం మంచిది.

రిటైర్మెంట్‌ ప్లాన్‌

మీ నాన్నకు రిటైర్మెంట్‌ ప్లాన్‌ బహుమతిగా ఇవ్వండి. లేదా ఆయన పేరిట యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌ (యూఎల్‌పీపీ)లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సాధారణంగా ఈ పథకాలు ఈక్విటీలతో పాటు రుణపత్రాల్లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. కాబట్టి, దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ గడువు ముగిశాక, పోగైన కార్ప్‌సలో 60 శాతం వెనక్కి తీసుకొని, మిగతా సొమ్ముతో నెలవారీ పెన్షన్‌ లభించేలా ప్లాన్‌ చేయండి. తద్వారా మలి వయసులో మీ నాన్నకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించండి. అంతేకాదు, మన సగటు ఆయష్షు 80 ఏళ్లకు పెరిగింది. కాబట్టి, రిటైర్మెంట్‌ తర్వాత 20-30 ఏళ్ల వరకు మీ నాన్నకు ప్రతినెలా ఖర్చులకు సరిపడా సొమ్ము చేతికందేలా దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టండి.


పొదుపు పథకాలు

మీ తండ్రి పేరిట కొంత సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. ఒకవేళ సీనియర్‌ సిటిజన్‌ అయితే, అధిక వడ్డీ చెల్లించే పొదుపు పథకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వీరి కోసం ప్రత్యేక పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. లేదంటే, ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. క్రమానుత పెట్టుబడి పథకాలు (సిప్‌) కూడా మంచి ప్రత్యామ్నాయం.

షేర్లు, సెక్యూరిటీలు

భవిష్యత్‌లో మంచి ప్రతిఫలాలు అందించేందుకు అవకాశాలున్న కంపెనీల షేర్లను కానుకగా ఇవ్వండి. ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. కొంత రిస్క్‌ తీసుకోగలిగితే, మంచి రేటింగ్‌ కలిగిన కార్పొరేట్‌ బాండ్లలోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

యాడ్‌ ఆన్‌ కార్డ్‌

మీ క్రెడిట్‌ కార్డుపై యాడ్‌ ఆన్‌ కార్డు తీసుకోగలిగే వెసులుబాటు ఉంటే.. దాన్ని మీ నాన్నకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. తద్వారా చిన్న మొత్తాల్లో ఖర్చుల కోసం వారు ఆ కార్డును ఉపయోగించుకునే వీలుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:21 AM