Indian Stock Market: మళ్లీ 80,000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:21 AM
సెన్సెక్స్ మరోసారి 80,000 పాయింట్ల ఎగువకు చేరింది. ఐటీ, వాహన రంగాల్లో కొనుగోళ్లతో సూచీలు లాభపడ్డాయి
మరో 520 పాయింట్లు పెరిగిన సూచీ
ముంబై: ఈక్విటీ సూచీలు వరుసగా ఏడో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 520.90 పాయింట్ల వృద్ధితో 80,116.49 వద్దకు చేరింది. సూచీ మళ్లీ 80,000 ఎగువకు చేరడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. అంతేకాదు, 2024 డిసెంబరు 18 తర్వాత సూచీకిదే గరిష్ఠ ముగింపు స్థాయి. కాగా, నిఫ్టీ 161.70 పాయింట్లు పెరిగి 24,328.95 వద్ద ముగిసింది. ఐటీ, వాహన రంగ షేర్లలో మదుపరులు జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) మన మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. కాగా గడిచిన 7 సెషన్లలో సెన్సెక్స్ 6,269.34 పాయింట్లు, నిఫ్టీ 1,929.80 పాయింట్లు పుంజుకున్నాయి.
దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మరో రూ.3.1 లక్షల కోట్ల వృద్ధితో రూ.430.47 లక్షల కోట్లకు (5.04 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. ఏడు రోజుల్లో మార్కెట్ సంపద రూ.36.65 లక్షల కోట్లు పెరిగింది.
ఏథర్ ఎనర్జీ ఐపీఓ ధర శ్రేణి రూ.304-321: ఏథర్ ఎనర్జీ ఐపీఓ ధర శ్రేణిని రూ.304-321గా నిర్ణయించింది. కంపెనీ పబ్లిక ఇష్యూ ఈనెల 28 ప్రారంభమై 30న ముగియనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న ప్రధాన కంపెనీ ఇదే.