Share News

SEBI IPO Reforms: ఐపీఓ మార్కెట్లో సంస్కరణలు

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:19 AM

దేశ క్యాపిటల్‌ మార్కెట్లో మరిన్ని సంస్కరణలకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సెబీ దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు...

SEBI IPO Reforms: ఐపీఓ మార్కెట్లో సంస్కరణలు

  • కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌పై కంపెనీలకు ఊరట

  • 10 ఏళ్ల వరకు గడువు పెంపు

  • సెబీ చైర్మన్‌ పాండే

ముంబై : దేశ క్యాపిటల్‌ మార్కెట్లో మరిన్ని సంస్కరణలకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సెబీ దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పెద్దమొత్తంలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీలకు పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ల జారీలో మరింత వెసులుబాటు కల్పించాలని సెబీ నిర్ణయించింది. రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీలు తమ ఈక్విటీలో 25 శాతం కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ (ఎంపీఎస్‌) కలిగి ఉండాలన్న గడువును ప్రస్తుత మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. కంపెనీలు ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ముందు కనీసం 8 శాతం ఈక్విటీ షేర్లను జారీ చేసి, ఆ తర్వాత మిగతా 17 శాతం ఈక్విటీ షేర్లను దశలవారీగా ఐపీఓల ద్వారా విక్రయించేందుకు అనుమతిస్తారు. రూ.లక్ష కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీలు ఐదేళ్లలో జారీ చేయాల్సిన ఎంపీఎస్‌ ఈక్విటీ షేర్ల పరిమితినీ సెబీ సవరించింది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఇందుకోసం ముందుగా 5 శాతం ఈక్విటీని ఎంపీఎ్‌సగా జారీ చేయాలి. దీన్ని 2.75 శాతానికి కుదించాలని సెబీ నిర్ణయించింది. ఇక రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీలు 25 శాతం ఎంపీఎ్‌సకి చేరాల్సిన గడువునీ ప్రస్తుత ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. ఇందుకోసం ఈ కంపెనీలు ముందు తమ ఈక్విటీలో 2.5 శాతం షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేస్తే సరిపోతుంది. మిగతా 22.5 శాతం ఈక్విటీ షేర్లను మార్కెట్‌ పరిస్థితులను బట్టి పదేళ్లలో జారీ చేస్తే సరిపోతుంది.


పెద్ద కంపెనీలకు ఊరట: సెబీ తాజా నిర్ణయం త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే రిలయన్స్‌ జియో, ఎన్‌ఎ్‌సఈలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఐపీఓలు జారీ చేస్తే.. ఆ ఇష్యూలను భరించే శక్తి మార్కెట్‌కు లేకపోవడంతో పాటు సెకండరీ మార్కెట్‌ కూడా తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. నిర్ణీత గడువులోనే దశల వారీగా ఈ వాటా విక్రయించేందుకు అనుమతించాలని కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సెబీ ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోదం తెలిపింది.

రిటైల్‌ మదుపరులకు ఊరట: ప్రస్తుతం రూ.5,000 కోట్లకు మించిన ఐపీఓ ఇష్యూల్లో రూ.2 లక్షల లోపు పెట్టుబడితో దరఖాస్తు చేసే రిటైల్‌ మదుపరులకు 35 శాతం షేర్లు కేటాయిస్తున్నారు. దీన్ని 25 శాతానికి కుదించాలని సంస్థాగత మదుపరుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయినా ఈ వాటాను యథాతథంగా 35 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించినట్టు సెబీ చైర్మన్‌ పాండే చెప్పారు. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (క్యూఐబీ)కు కేటాయించే 50 శాతం వాటానూ అలాగే కొనసాగించాలని సెబీ నిర్ణయించింది.

ఎఫ్‌పీఐల పెట్టుబడులకు సింగిల్‌ విండో: భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా తక్కువ రిస్క్‌ కలిగిన ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సింగిల్‌ విండో ఆటోమేటిక్‌ అండ్‌ జనరలైజ్డ్‌ యాక్సెస్‌ ఫర్‌ ట్రస్టెడ్‌ ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌ (స్వాగత్‌-ఎ్‌ఫఐ) పేరుతో కొత్త ముసాయిదాను రూపొందించింది. కాగా దేశంలో ప్రతి నెలా 100 ఎఫ్‌పీఐలు నమోదవుతూ వస్తున్నాయని సెబీ తెలిపింది. ఏడాది క్రితం 10,500 ఎఫ్‌పీఐలు నమోదై ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 12,000 దాటిందని పేర్కొంది.


ఇతర ప్రధాన నిర్ణయాలు

  • రూ.250 కోట్లకు మించిన ఐపీఓల్లో యాంకర్‌ ఇన్వెస్టర్ల వాటా 10ు నుంచి 15 శాతానికి పెంపు

  • రూ.250 కోట్ల కంటే తక్కువ ఉండే ఐపీఓల్లో మదుపు చేసే యాంకర్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 5 నుంచి 15 మధ్య ఉండాలి

  • నియమిత మదుపరులకు సేవలు అందించే ఏఐఎ్‌ఫలకు ఊరట

  • రీట్స్‌, ఇన్విట్స్‌.. ఈక్విటీ పెట్టుబడులుగా వర్గీకరణ

  • ప్రతి స్టాక్‌ ఎక్స్చేంజీలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల నియామకం

ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 03:19 AM