Challa Srinivasaulu Shetty: వడ్డీ రేట్లు తగ్గినా బేఫికర్
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:23 AM
ఆర్‌బీఐ కీలక రెపోరేటు మరో పావు శాతం తగ్గించినా తమ నికర వడ్డీ లాభాలకు ఢోకా ఉండదని ఎస్‌బీఐ భావిస్తోంది. బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ...
మా లాభాలకు ఢోకా ఉండదు
పావు శాతం వరకు తగ్గనున్న ‘రెపో’
ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ కీలక రెపోరేటు మరో పావు శాతం తగ్గించినా తమ నికర వడ్డీ లాభాలకు ఢోకా ఉండదని ఎస్‌బీఐ భావిస్తోంది. బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. సెప్టెంబరు త్రైమాసికానికి 2.97 శాతంగా ఉన్న తమ నికర వడ్డీ లాభం శాతం వచ్చే ఏడాది మార్చి మూడు శాతానికి చేరుతుందని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ చీఫ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తానికి చూసినా జీడీపీ వృద్దిరేటు ఏడు శాతానికి పైనే ఉండవచ్చునన్నారు.
మారిన వైఖరి : నిజానికి డిసెంబరు 5న ముగిసే ఎంపీసీ భేటీలో ఆర్‌బీఐ కీలక రెపోరేటు జోలికి పోకపోవచ్చని ఎస్‌బీఐ నిన్న మొన్నటి వరకు భావించింది. ఆర్‌బీఐ కూడా ఇవే సంకేతాలు ఇచ్చింది. అయితే అక్టోబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణం పావు శాతానికి పడిపోయిన నేపథ్యంలో డిసెంబరు 5న ముగిసే భేటీలోనూ రెపోరేటు మరింత కుదించే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ తగ్గింపు పావు శాతం వరకు ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి చెప్పారు.
కలిసి రానున్న అంశాలు : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు బ్యాంకులు తన ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) ఒక శాతం వరకు తగ్గించింది. దీంతో బ్యాంకుల వద్ద నిధుల లభ్యత పెరిగి వడ్డీ ఆదాయం పెరుగుతోంది. దీనికి తోడు అధిక వడ్డీరేటుతో తీసుకున్న డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లను బ్యాంకు తగ్గిస్తోంది. ఎస్‌బీ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటునీ ఎస్‌బీఐ 0.2ు తగ్గించింది. ఇవన్నీ తమ నికర వడ్డీ లాభాలను పెంచుతాయని శ్రీనివాసులు శెట్టి చెప్పారు.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!