Share News

ఐటీలో జీతాల పెంపు అంతంతే..

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:25 AM

భారత ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఇంకా కష్టాల్లోనే ఉంది. ఈ ప్రభావం ఉద్యోగుల జీతాలపైనా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా ఐటీ ఉద్యోగుల జీతా ల పెంపు అంతంత...

ఐటీలో జీతాల పెంపు అంతంతే..

  • 4 నుంచి 8.5% మించకపోవచ్చు

  • ఫ్రెషర్స్‌ పరిస్థితి మరింత దారుణం

  • వేచి చూసే ధోరణిలో కంపెనీలు

  • ప్రత్యేక నైపుణ్యాలకు మాత్రం ఫుల్‌ డిమాండ్‌

  • టీమ్‌లీజ్‌ డిజిటల్‌

న్యూఢిల్లీ: భారత ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ఇంకా కష్టాల్లోనే ఉంది. ఈ ప్రభావం ఉద్యోగుల జీతాలపైనా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా ఐటీ ఉద్యోగుల జీతా ల పెంపు అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా. ఈ పెంపు మహా అయితే సగటున 4 నుంచి 8.5 శాతానికి మించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఐటీ ఉద్యోగుల జీతాలు సగటున 8.4 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, సరికొత్త నైపుణ్యాలకు డిమాండ్‌ పెరగడం, కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న ప్రాధాన్యత ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల జీతా ల పెరుగుదలను దెబ్బతీయనున్నాయి. ‘ఈ సంవత్సరం జీతాల పెంపుపై ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరించబోతున్నాయి’ అని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ విజ్‌ తెలిపారు. ఆర్థిక అనిశ్చితితో పాటు కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించుకోవడం, మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలూ ఇందుకు దోహదం చేస్తున్నట్టు ఆమె చెప్పారు.


మదింపు వాయిదా

సాధారణంగా ఐటీ కంపెనీలు ఏటా మార్చికల్లా ఉద్యోగుల పనితీరు మదింపు పూర్తి చేసి ఏప్రిల్‌ నుంచి జీతాలు పెంపు అమలు చేస్తాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు టీసీఎస్‌ ఒక్కటే ఈ పని పూర్తి చేసింది. తన ఉద్యోగుల జీతాలు సగటున 4 నుంచి 8 శాతం వరకు పెంచింది. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలు ఈ సంవత్సరం జీతాలు ఎప్పటి నుంచి పెంచేది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు మా జీతాలు ఎప్పటి నుంచి పెంచుతారు బాస్‌? అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ‘ప్రస్తుతానికైతే రెండంకెల్లో జీతాల వృద్ధి గతం. ఈ సంవత్సరం జీతాల పెంపు మహా అయితే 5 నుంచి 8.5 శాతం మించక పోవచ్చు’ అని రీడ్‌ అండ్‌ విల్లో సీఈఓ జానూ మొత్యాని చెప్పారు.


తగ్గిన వలసలు

పరిస్థితులు బాగోకపోవడంతో ఐటీ ఉద్యోగులు కూడా గతంలోలా అధిక జీతాలకు ఆశపడి పెద్దగా కంపెనీలు (ఉద్యోగాలు) మారడం (అట్రిషన్‌) లేదు. 2023లో ఐటీ ఉద్యోగుల సగటు అట్రిషన్‌ రేటు 18.3 శాతం ఉండేది. గత ఏడాది ఇది 17.7 శాతానికి పడిపోయింది. కంపెనీలు జీతాల పెంపు ఆలస్యం చేయడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కొన్ని ఐటీ కంపెనీలు మంచి పనితీరుతో కంపెనీనే అంటిపెట్టుకున్న ఉద్యోగులకు ఏటా రిటెన్షన్‌ బోనస్‌ పేరుతో ప్రత్యేక బోన్‌సలు చెల్లించేవి. ఈ సంవత్సరం చాలా కంపెనీలు ఈ బోనస్‌ గురించీ నోరు మెదపడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కోలా..

ఐటీ ఉద్యోగులందరి జీతాల పెంపు ఈ సంవత్సరం ఒకేలా ఉండదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), క్లౌడ్‌ ఇంజనీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ. డేటా సైన్స్‌, బ్లాక్‌చెయిన్‌ వంటి టెక్నాలజీలపై పట్టు, మంచి పనితీరు ఉన్న మిడ్‌ లెవల్‌ ఉద్యోగుల జీతాలు 10 నుంచి 12 శాతం, సరికొత్త డొమైన్స్‌లో ప్రత్యేక నైపుణ్యాలు, నాయకత్వ స్థానాల్లో ఉండే సీనియర్ల జీతాలు 12 నుంచి 15 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెషర్స్‌ జీతాలు మాత్రం వారి పనితీరు ఆధారంగా రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉందని అడెకో ఇండియా అనే ఐటీ నియామక సేవల సంస్థ తెలిపింది.


Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 05:25 AM