Rupee slides: దేవుడా.. మరింతగా క్షీణించిన రూపాయి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:41 AM
అమెరికా భారత్ వాణిజ్య డీల్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా తగ్గింది. ప్రస్తుతం 90.56 వద్ద తచ్చాడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగానే సోమవారం ట్రెండింగ్ మొదలైన కాసేపటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా తగ్గింది. వార్త ప్రచురించే సమయానికి (సోమవారం ఉదయం 11.30 గంటలకు) 90.56 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని తాకింది. డాలర్‌తో పోలిస్తే 90.45 వద్ద మొదలైన రూపాయి ట్రేడింగ్ ఆ తరువాత కాసేపటికే మరింత కనిష్ఠ స్థాయికి చేరింది (Rupee-Dollar Exchange Rate).
ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువే అత్యధికంగా పతనమైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మారకం విలువ 5.6 శాతం మేర తగ్గింది.
కారణాలు ఇవీ
ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య డీల్ కోసం మార్కెట్ వర్గాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. డీల్ త్వరగా కుదరని పక్షంలో వచ్చే నెల రూపాయి మారకం విలువ 91కు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య డీల్ కుదరకపోవడమే రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీల్ కుదరని కారణంగా భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇది చివరకు భారతీయ కరెన్సీ విలువ తగ్గేలా చేస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గడం కూడా రూపాయి పతనానికి మరొక ప్రధాన కారణం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే, ఆర్‌బీఐ సాయం ఆశించిన మేర లేదనేది మార్కెట్ వర్గాల కామెంట్.
మరోవైపు బాండ్, ఈక్విటీ మార్కెట్‌ల నుంచి ఎఫ్‌పీఐ పోర్టుఫోలియో నిధులు తరలిపోతుండటం కూడా కరెన్సీ విలువపై ఒత్తిడి పెంచుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్ఎస్‌ఈలోని డిసెంబర్ 12 నాటి డేటా ప్రకారం, విదేశీ వ్యవస్థాగత మదుపర్లు రూ.1114 కోట్ల మేర ఈక్విటీలను విక్రయించారు. అయితే, దేశీయ మదుపర్లు మాత్రం పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే, భారత్-యూఎస్ మధ్య డీల్ కుదరడంపై ఇప్పటికే సానుకూల సంకేతాలు ఉన్న నేపథ్యంలో తాత్కాలిక ఊరట దక్కే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.50-91.00 మధ్య కదలాడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
గమనిక: డాలర్-రూపాయి మారకం విలువ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. అప్‌డేటెడ్ వివరాల కోసం మరొకసారి వాకబు చేసుకోవాలని మనవి.
ఇవీ చదవండి:
జనవరి నుంచి పెరగనున్న టీవీల ధరలు!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి