TV Price Hike: జనవరి నుంచి పెరగనున్న టీవీల ధరలు!
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:01 AM
కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెమరీ చిప్‌ల కొరత, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఇందుకు కారణంగా ఉండనుంది.....
3 నుంచి 4 శాతం వరకు పెరిగే చాన్స్
ఇటు చిప్‌ల కొరత, అటు రూపాయి క్షీణత
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెమరీ చిప్‌ల కొరత, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఇందుకు కారణంగా ఉండనుంది. ఇప్పటికే మెమరీ చిప్‌ల కొరతగా కారణంగా వాటి ధరల్లో పెరుగుదల, రూపాయి క్షీణత ప్రభావం టీవీల తయారీపై ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. దీంతో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 90 దాటింది. మరోవైపు టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్‌సెల్, సెమీ కండక్టర్ చిప్‌లు, మదర్‌బోర్డు వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌ల డిమాండ్ భారీగా ఉంది. ఫలితంగా అన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు చిప్ తయారీదారులు అధిక లాభాలందించే ఏఐ చిప్‌ల తయారీపై మొగ్గు చూపుతున్నందు వల్ల టీవీల వంటి లెగసీ డివై్‌సల సరఫరా తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎల్‌ఈడీ టీవీల ధర 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎ్‌స సతీశ్ అన్నారు.
మూడేళ్లలో 500ు పెరిగిన మెమరీ చిప్‌ల ధర
కాగా కొన్ని టీవీ తయారీ కంపెనీలు ఇప్పటికే టీవీల ధర పెరిగే అవకాశం ఉన్నట్టు డీలర్లకు తెలియచేశాయి. గత మూడేళ్ల కాలంలో మెమరీ చిప్‌ల ధర 500ు మేరకు పెరిగిందని థామ్సన్, కోడక్ వంటి టీవీల తయారీ లైసెన్సు గల సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దీంతో టీవీల ధరలు 7-10 శాతం పెరిగే ఆస్కారం ఉన్నదని ఆ కంపెనీ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా అన్నారు. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ కూడా చిప్‌ల ధర పెరుగుతూనే ఉండవచ్చని, అదే జరిగితే ధరలు మరింత పెంచక తప్పదని ఆయన హెచ్చరించారు. సొంత బ్రాండ్ దైవాతో పాటు అనేక టీవీలకు ఒరిజినల్ డిజైన్ తయారీదారుగా (ఓడీఎం) ఉన్న వీడియోటెక్స్.. మెమరీ చిప్‌ల లభ్యత పెద్ద సవాల్‌గా ఉండనుందని తెలిపింది.
వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు ఇంతే..
సోర్సింగ్ స్థాయిలో ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 ధరలు వెయ్యి శాతం మేరకు పెరిగాయని, వాటిని ఏఐ డేటా సెం టర్లకు సరఫరా చేయడమే ఇందుకు కారణమని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ అన్నారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని. ఆ తర్వాత చిప్‌ల తయారీ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువలో క్షీణత పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని, దీనివల్ల దిగుమతి వ్యయాలు పెరిగిపోయాయని చెప్పారు. రాబోయే వారాల్లో మార్కెట్లో పాత ఇన్వెంటరీ పూర్తయిన తర్వాత నుంచి వీటి ప్రభావం క్రమంగా వినియోగదారుపై కనిపిస్తుందని బజాజ్ అన్నారు.