RGIA Airport : హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ

ABN , First Publish Date - 2025-02-22T04:11:58+05:30 IST

ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి.

RGIA Airport : హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ

  • 2031 నాటికి ఐదు కోట్ల మంది ప్రయాణికులు

  • మే కల్లా కొత్త కార్గో టెర్మినల్‌ నిర్మాణం పూర్తి

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఈ విమానాశ్రయం నుంచి 2.5 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 కోట్లకు పెరగనుందని సంస్థ సీఈఓ ప్రదీప్‌ ఫణిక్కర్‌ వెల్లడించారు. గంటకు 42 విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ప్రస్తుతం గంటకు సగటున 34 నుంచి 35 విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ జరుగుతోంది.

సరుకు రవాణా: ఈ ఆర్థిక సంవత్సరం ఎయిర్‌పోర్ట్‌ ద్వారా జరిగే సరుకు రవాణా 1.8 లక్షల టన్నులకు చేరుతుందని యాజమాన్యం భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువని ఫణిక్కర్‌ చెప్పారు. రూ.370 కోట్ల పెట్టుబడితో కార్గో టెర్మినల్‌ వార్షిక సామర్ధ్యాన్ని నాలుగు లక్షల టన్నులకు పెంచనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.215 కోట్లు ప్రస్తుత టెర్మినల్‌ సామర్ధ్య విస్తరణ కోసం వినియోగిస్తారు. మిగతా రూ.155 కోట్లతో మరో కొత్త టెర్మినల్‌ ఏర్పాటు చేస్తారు. కొత్త టెర్మినల్‌ నిర్మాణం ఈ ఏడాది మేకల్లా పూర్తి చేసి జూన్‌ లేదా జూలై కల్లా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్‌ యాజమాన్యం భావిస్తోంది.

Updated Date - 2025-02-22T04:12:11+05:30 IST