Share News

Rbi Governor: రుణాలు మరింత చవక

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:52 AM

రుణగ్రహీతలకు శుభవార్త. రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును ఆర్‌బీఐ మరో 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది......

Rbi Governor: రుణాలు మరింత చవక

  • గృహ, వాహన రుణాలపై తగ్గనున్న ఈఎంఐల భారం

  • రెపో రేటు 0.25ు తగ్గింపు.. 5.25 శాతానికి తగ్గిన రెపో

  • భవిష్యత్‌ రేట్లపై తటస్థ వైఖరి యథాతథంగా కొనసాగింపు

  • జీడీపీ వృద్ధి అంచనా 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంపు

  • జూ ద్రవ్యోల్బణం అంచనా 2.6 శాతం నుంచి 2 శాతానికి తగ్గింపు

  • దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యత భారీగా పెంపు

  • ఓఎంఓ ద్వారా రూ.లక్ష కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు

  • రూ.45,000 కోట్ల డాలర్‌/రూపీ మార్పిడి వేలం నిర్వహణ

  • ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ

  • 2026 ఫిబ్రవరి 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష

ముంబై: రుణగ్రహీతలకు శుభవార్త. రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును ఆర్‌బీఐ మరో 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది. తద్వారా రెపో అనుసంధానిత గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. ఇప్పటికే రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ చెల్లింపుల భారం కూడా తగ్గనుంది. చవక వడ్డీ రేట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాల వృద్ధితో పాటు అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికీ దోహదపడనున్నాయి.

వడ్డీ రేట్లపై ఏకగ్రీవ నిర్ణయం

ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు సమావేశమైంది. శుక్రవారంతో ముగిసిన ఈ సమీక్షలో కమిటీ సభ్యులు రెపో రేటును మరో పావు శాతం తగ్గించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, భవిష్యత్‌ రేట్లపైన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తద్వారా ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించేందుకు అవకాశాలున్నాయని సంకేతాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెపో రేటును తగ్గించడం ఇది నాలుగోసారి. ఈ నాలుగు విడతల్లో రెపోను 1.25 శాతం తగ్గించింది. అంచనాల కంటే వేగంగా తగ్గిన ద్రవ్యోల్బణం.. అనుకూల స్థాయిలోనే కదలాడినంత కాలం రెపో రేటు కూడా తక్కువ స్థాయిలోనే కొనసాగనుందని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు.

ధరలు.. కూల్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను ఆర్‌బీఐ గతంలో ప్రకటించిన 2.6 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి 1.7 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం అక్టోబరులో రికార్డు కనిష్ఠ స్థాయి 0.25 శాతానికి తగ్గింది. ధరలు అంచనాల కంటే వేగంగా తగ్గుతూ వచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాను కూడా తగ్గించింది.

వృద్ధి హైజంప్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతానికి ఎగబాకవచ్చని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో ప్రకటించిన 6.8 శాతంతో పోలిస్తే వృద్ధి అంచనాను ఏకంగా 0.5 శాతం పెంచింది. ఈ సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల్లో (క్యూ2)లో జీడీపీ వృద్ధి రేటు 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.2 శాతానికి చేరుకోవడంతోపాటు ఈనెలతో ముగియనున్న మూడో త్రైమాసికం (క్యూ3)లోనూ మెరుగైన వృద్ధి నమోదుకు అవకాశాలున్నాయని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాను గణనీయంగా పెంచింది.


డాలర్‌/రూపీ మార్పిడి ఎలా..?

మూడేళ్ల డాలర్‌/రూపీ క్రయ-విక్రయ మార్పిడిలో భాగంగా ఆర్‌బీఐ తొలుత బ్యాంకుల నుంచి డాలర్లను కొనుగోలు చేస్తుంది. తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో దేశీయ కరెన్సీ లభ్యత పెరుగుతుంది. మలివిడతలో భాగంగా ఆర్‌బీఐ మూడేళ్ల తర్వాత ఆ డాలర్లను తిరిగి బ్యాంకులకు ముందస్తుగానే నిర్ణయించిన ధరకు విక్రయిస్తుంది. రూపాయల్లో ద్రవ్య లభ్యత నిర్వహణతో పాటు కరెన్సీ స్థిరత్వం, విదేశీ మారకం నిల్వలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుంది.

రూపాయి మారకం విలువకు లక్ష్యాన్నేమీ నిర్దేశించుకోలేదు..

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకం విలువను ఫలానా స్థాయి లేదా శ్రేణికి కట్టడి చేయాలని లక్ష్యాన్నేమీ నిర్దేశించుకోలేదని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు. రూపాయి విలువను మార్కెట్‌ పరిస్థితులే నిర్ణయిస్తాయని పరపతి సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటుందని, అధిక లేదా అసాధారణ స్థాయిలో హెచ్చుతగ్గులను తగ్గించడంపైనే ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందన్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.90కి చేరిన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బ్యాంకింగ్‌లోకి రూ.1.45 లక్షల కోట్లు

రుణాలకు గిరాకీ మరింత పెరగనున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగంలో ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్‌బీఐ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల (ఓఎంఓ) ద్వారా రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11న, 18న రూ.50,000 కోట్ల చొప్పున రెండు విడతల్లో బాండ్ల కొనుగోలును చేపట్టనుంది. అలాగే, మూడేళ్ల కాలపరిమితితో 500 కోట్ల డాలర్ల (సుమారు రూ.45,000 కోట్లు) విలువైన డాలర్‌/రూపీ క్రయ-విక్రయ మార్పిడి వేలాన్ని ఈనెల 16న నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ రెండు చర్యల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి అదనంగా రూ.1.45 లక్షల కోట్లు వచ్చి చేరనున్నాయి.


గృహ రుణం ఎంత తగ్గుతుందంటే..

  • వడ్డీ రేట్లు తగించిన బీఓబీ, బీఓఐ

ఆర్‌బీఐ కీలక రెపో రేటును మరో పావు శాతం తగ్గించింది. ఈ ప్రభావం రెపో రేటు ఆధారిత గృహ రుణాలపై ముఖ్యంగా ఫ్లోటింగ్‌ రేట్‌ హోమ్‌ లోన్ల ఈఎంఐలపైనా పడనుంది. ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (బీఓఐ) ప్రకటించాయి. బీఓఐ తన వడ్డీ రేటును 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. శుక్రవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది కాగా బీఓబీ.. శనివారం నుంచి వడ్డీ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. త్వరలోనే మిగతా బ్యాంకులూ ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

రూ.25 లక్షల గృహ రుణంపై..

  • రుణ చెల్లింపు కాలపరిమితి 15 ఏళ్లు

  • 8.5ు వడ్డీ రేటుతో చెల్లిస్తున్న ఈఎంఐ రూ.24,618

  • 8.25ు వడ్డీ రేటుతో చెల్లించే ఈఎంఐ రూ.24,254

  • నెలనెలా తగ్గే ఈఎంఐ రూ.364

  • 8.5ు వడ్డీ రేటుతో 15 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ రూ.19,31,328

  • 8.25ు వడ్డీతో చెల్లించే మొత్తం వడ్డీ రూ.18,65,632

  • ఆదా అయ్యే వడ్డీ రూ.65,696

రూ.50 లక్షల గృహ రుణంపై..

  • కాలపరిమితి 20 ఏళ్లు

  • 8.5ు వడ్డీ రేటుతో చెల్లిస్తున్న ఈఎంఐ రూ.43,391

  • కొత్త వడ్డీ రేటు 8.25ుతో చెల్లించే ఈఎంఐ రూ.42,603

  • నెలనెలా ఆదా అయ్యే ఈఎంఐ రూ.788.

  • పాత వడ్డీ రేటుతో 20 ఏళ్లలో చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ.54,13,879

  • కొత్త వడ్డీ రేటుతో చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ.52,24,788

  • ఆదా అయ్యే వడ్డీ రూ.1,89,091

రూ.75 లక్షల గృహ రుణంపై..

  • కాలపరిమితి 20 ఏళ్లు

  • 8.5ు వడ్డీతో ప్రస్తుత ఈఎంఐ రూ.60,392

  • కొత్త వడ్డీ రేటు 8.25ుతో చెల్లించే ఈఎంఐ రూ.59,134

  • నెలనెలా తగ్గే ఈఎంఐ రూ.1,258

  • పాత వడ్డీ రేటుతో 20 ఏళ్లలో చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ.1,06,17,609

  • కొత్త వడ్డీ రేటుతో 20 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ రూ.1,02,40,128

  • ఆదా అయ్యే వడ్డీ రూ.3,77,481

Updated Date - Dec 06 , 2025 | 03:52 AM