RBI Silver Loans: వెండిపైనా రుణాలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:08 AM
ఇంట్లో బోలెడన్ని వెండి నగలు, నాణేలు ఉన్నాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద వీటిని కుదువ పెట్టి రుణాలు తీసుకోవచ్చా? ప్రస్తుతానికైతే లేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి...
2026 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి
నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్‌బీఐ
ఇంట్లో బోలెడన్ని వెండి నగలు, నాణేలు ఉన్నాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద వీటిని కుదువ పెట్టి రుణాలు తీసుకోవచ్చా? ప్రస్తుతానికైతే లేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇందుకు అవకాశం ఏర్పడనుంది. ఇందుకోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (గోల్డ్ అండ్ సిల్వర్ లోన్స్) డైరెక్షన్స్, 2025 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పసిడి, వెండి రుణాల మంజూరులో పారదర్శకత, నియంత్రణ కోసం ఆర్‌బీఐ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో వెండి నగలు, నాణేలు కుదువ పెట్టేటప్పుడు వాటికి సరైన విలువ కూడ లభిస్తుందని భావిస్తున్నారు.
రుణ పరిమితులు
రూ.2.5 లక్షల వరకు వెండి నగలు, నాణేల విలువలో 85% వరకు
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు రుణాలైతే విలువలో 80% వరకు
తీసుకునే రుణం రూ.5 లక్షలకు మించి ఉంటే విలువ లో 75% వరకు
విలువ లెక్కింపు విధానం
గత నెల రోజుల్లో వెండి సగటు ధర లేదా క్రితం రోజు ముగింపు ధర.. వీటిలో ఏది తక్కువైతే దాని ఆధారంగా వెండి నగలు, నాణేల విలువ లెక్కకడతారు. ఈ ధరలను ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) నుంచి లేదా ఏదైనా గుర్తింపు పొందిన కమోడిటీస్ ఎక్స్ఛేంజీ నుంచి తీసుకుంటారు. నగలైతే అందులోని విలువైన రత్నాలు, రాళ్ల విలువను పరిగణనలోకి తీసుకోరు.
రుణం తీర్చిన 7 రోజుల్లో వెనక్కు..
బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణేలు హామీగా పెట్టి తీసుకున్న రుణాలను తీర్చివేసిన ఏడు పని దినాల్లో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, గృహ రుణ కంపెనీలు వాటిని కుదువ పెట్టిన వారికి తిరిగి ఇవ్వాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా రోజుకు రూ.5,000 చొప్పున వాటి యజమానులకు నష్ట పరిహారంగా చెల్లించాలి.
రెండేళ్లలో క్లెయిమ్ చేయకపోతే వేలానికి
తీసుకున్న రుణాన్ని ఖాతాదారుడు నిర్ణీత కాలంలోగా చెల్లించక పోతే బ్యాంకులు కుదువపెట్టిన బంగారం, వెండి ఆభరణాలు, నాణేలను వేలం వేసి తమ సొమ్ము రాబట్టుకోవచ్చు. కాకపోతే ఈ వేలం వేసి రాబట్టిన ధర మార్కెట్ ధరలో 90 శాతం కంటే తక్కువ ఉండకూడదు. కుదువ పెట్టి రెండేళ్లయినా క్లెయిమ్ చేయని బంగారం, వెండి నగలు, నాణేలను అన్‌క్లెయిమ్డ్‌గా వర్గీకరించి, వాటి యాజమానుల ఉనికిని కనుగొనేందుకు బ్యాంకులు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి.
ఈ రుణాలు ఎవరిస్తారంటే..
వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. బంగారం, వెండి ఆభరణాలు, నాణేల తాకట్టు రుణాలు ఇవ్వవచ్చు. అయితే శుద్ధమైన బంగారం, వెండి కడ్డీలు గోల్డ్ లేదా సిల్వర్ ఈటీఎ్‌ఫలు, మ్యూచువల్ ఫండ్స్‌పై మాత్రం ఈ తరహా రుణాలు లభించవు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వెండి ఆభరణాలు, నాణేలు స్థానిక వ్యాపారుల వద్ద కుదువ పెట్టి అధిక వడ్డీలకు రుణం తీసుకునే బాధ తగ్గనుంది.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి