ONGC to Invest: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:27 AM
ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్‌జీసీ. ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువుల అన్వేషణను ఉధృతం చేస్తోంది...
రూ.8,110 కోట్లతో 172 బావుల తవ్వకం
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువుల అన్వేషణను ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.8,110 కోట్ల పెట్టుబడి అంచనాతో రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ప్రాంతంలోని భూ ఉపరితల ప్రాంతాల్లో 172 బావులు తవ్వబోతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఈఎ్‌ఫసీసీ)కు చెందిన నిపుణుల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. కోనసీమ ప్రాంతంలో తనకు కేటాయించిన ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (పీఎంఎల్) బ్లాకుల్లో ఓఎన్‌జీసీ ఈ తవ్వకాలు జరపనుంది. ఇందులో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) కోసం రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం రూ.11 కోట్లు ఖర్చు చేయనుంది.
షరతులు: కేజీ బేసిన్ ప్రాంతంలో చమురు, గ్యాస్ తవ్వకాలకు అనుమతి ఇస్తూనే పర్యావరణ సంరక్షణకు ఎంఈఎ్‌ఫసీసీ పెద్దపీట వేసింది. ఓఎన్‌జీసీ తవ్వే ఈ 172 బావుల్లో ఏ బావి కూడా కోరంగి వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి పది కిలోమీటర్ల లోపు ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే ముందస్తు అనుమతి లేకుండా అటవీ ప్రాంతాలు, సంరక్షిత ప్రాంతాల నుంచి ఎలాంటి పైప్‌లైన్లు వేయకూడదని షరతు విధించింది. చమురు, గ్యాస్ క్షేత్రాల కారణంగా కోనసీమ ప్రాంతంలో భూమి కుంగిపోతోందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈఎ్‌ఫసీసీ నిపుణుల కమిటీ ఈ షరతులు విధించినట్టు భావిస్తున్నారు.
భారీ నిక్షేపాలు: కేజీ బేసిన్‌లో దాదాపు 69.8 కోట్ల టన్నుల చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. దీంతో ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఈ ప్రాంతంలో పెద్దఎత్తున చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషిస్తున్నాయి. రిలయన్స్ ఇప్పటికే ఈ ప్రాంత లోతట్టు సముద్ర జలాల్లో గ్యాస్ ఉత్పత్తి చేపట్టింది. ఓఎన్‌జీసీ కూడా 500 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించింది. ఇప్పుడు కేజీ బేసిన్‌లోని ఉపరితల ప్రాంతంలోనూ పెద్దఎత్తున బావులు తవ్వి చము రు, గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తోంది.
చమురు గిరాకీ మరింత పైకే
పునరుత్పాదక ఇంధన వినియోగం ఎంతగా పెరుగుతున్నా మన దేశంలో చమురు గిరాకీ ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రస్తుతం రోజుకు 54 లక్షల బ్యారళ్ల వరకు ఉన్న డిమాండ్ 2050 నాటికి 91 లక్షల బ్యారళ్లకు చేరుతుందని బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) ప్రధాన ఆర్థికవేత్త స్పెన్సర్ డేల్ అంచనా. ఇదే సమయంలో దేశ సహజ వాయువు డిమాండ్ కూడా రెండింతలు పెరిగి 15,300 కోట్ల ఘనపు మీటర్లకు చేరుతుదని తెలిపారు. వచ్చే పాతికేళ్లలో చమురు గిరాకీ మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరగదని తేల్చిచెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ఎంతగా పెరిగినా భారత ఇంధన వినియోగంలో చమురు వాటా హవా కొనసాగుతుందన్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి