Oaktree: హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసిన ఓక్‌ట్రీ..
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:06 PM
ప్రపంచ పెట్టుబడి నిర్వాహక సంస్థలలో అగ్రగామి అయిన ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిన ఓక్‌ట్రీ..

హైదరాబాద్, మార్చి 7, 2025: ప్రపంచ పెట్టుబడి నిర్వాహక సంస్థలలో అగ్రగామి అయిన ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిన ఓక్‌ట్రీ.. తన కార్యకలాపాలు సాగించేందుకు హైదరాబాద్ అనువైన ప్రాంతంగా ఎంచుకుంది. ఓక్‌ట్రీ నిర్ణయంతో కొత్తగా చాలా మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత, బాహ్య వాటాదారులకు అధిక నాణ్యత గల సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది. ‘వ్యాపార వాతావరణం, ఆవిష్కరణ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను ప్రారంభించడంపై సంతోషిస్తున్నాము’ అని ఓక్‌ట్రీ కో -చైర్మన్ హోవార్డ్ మార్క్స్ అన్నారు. ఓక్‌ట్రీ హైదరాబాద్ కార్యాచరణ శ్రేష్ఠత పట్ల తమ అంకితభావాన్ని, భారతదేశం అందించే అపారమైన అవకాశాలపై తమ నమ్మకాన్ని సూచిస్తుంది.’ అని పేర్కొన్నారు.
ఓక్‌ట్రీ హైదరాబాద్ రీజియన్ మానవ వనరుల డైరెక్టర్‌గా అజయ్ మద్దాలి నియమితులయ్యారు. ఓక్‌ట్రీ లోకల్ హెఆర్ నమూనాను డెవలప్ చేయడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో కంపెనీ స్టాండర్డ్స్ కొనసాగించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. హెచ్ఆర్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌లో అపారమైన అనుభవం అజయ్ సొంతం. ఆయన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌లో ఇండియా రీజియన్ హెచ్ఆర్ హెడ్‌గా కూడా పని చేశారు. ఓక్‌ట్రీలో చేరడం, భారతదేశంలో ఈ ఉత్తేజకరమైన విస్తరణకు తోడ్పడటం సంతోషంగా ఉంది అని అజయ్ మద్దాలి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని తెరవడం ద్వారా.. తమ ప్రపంచ కార్యకలాపాలను విస్తరింపజేయడానికి, సేవల్లో నాణ్యతను మెరుగుపరచడానికి, స్థానిక నైపుణ్యాన్ని పోత్సహించే అవకాశం ఉంటుందన్నారు.
ఇండియా ప్రైవేట్ క్రెడిట్‌లో అతిపెద్ద, అత్యంత చురుకైన పెట్టుబడిదారులలో ఓక్‌ట్రీ ఒకటి. ఓక్‌ట్రీ గ్లోబల్ ఆపర్చునిటీస్ స్ట్రాటజీ ఆసియా హెడ్ గౌరవ్ పరాశ్రంపురియా నేతృత్వంలో 2023లో ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో 24 నగరాల్లో ఓక్‌ట్రీ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కేంద్రాలు.. హైదరాబాద్, హాంకాంగ్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ముంబై, షాంఘై, బీజింగ్, సియోల్ కార్యాలయాలు ముఖ్యమైనవి.