Share News

అనవసర ఖర్చులు వద్దు..!

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:09 AM

ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ సామాన్యులకు పెద్దగా న్యాయం చేయలేక పోయినప్పటికీ.. మధ్య తరగతికి ముఖ్యంగా ఉద్యోగులకు మాత్రం పెద్ద మేలే చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు...

అనవసర ఖర్చులు  వద్దు..!

పన్ను ఆదా సొమ్ముతో

సంపద పెంచుకోండి..

దీర్ఘకాలిక పెట్టుబడులే ముద్దు

ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ సామాన్యులకు పెద్దగా న్యాయం చేయలేక పోయినప్పటికీ.. మధ్య తరగతికి ముఖ్యంగా ఉద్యోగులకు మాత్రం పెద్ద మేలే చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు చిల్లి గవ్వ కూడా ఆదాయ పన్ను (ఐటీ) భారం లేకుండా బయటపడొచ్చు.

మిగులు ఎంతంటే..

బడ్జెట్‌ ప్రతిపాదనలతో రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి రూ.83,200, రూ.15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.32,500 చొప్పున పన్ను భారం తగ్గుతుంది. అదే రూ.24 లక్షల వార్షికాదాయం ఉంటే రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయం ఉంటే రూ.1,25,840 చొప్పున, రూ.5 కోట్ల వరకు ఉంటే రూ.1.43 లక్షల వరకు పన్ను భారం తగ్గుతుంది. పన్ను పోటు తగ్గింది కదా అని.. మిగిలిన నాలుగు డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం మంచిది కాదు. ఈ కొద్ది మొత్తాన్ని కూడా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు వీలుగా మంచి పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడం ఆయా వ్యక్తుల ఆర్థిక భద్రతకు మంచిది.


జర జాగ్రత్త

పైన పేర్కొన్న పన్ను ప్రయోజనాలన్నీ 2020-21లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారికి మాత్రమే. ఈ కొత్త విధానం ఎంచుకునే వారికి పన్ను ఎగవేత నిరోధక పథకాలు గానీ, పెట్టుబడుల మినహాయింపులుగానీ లభించవు. మధ్య తరగతి ప్రజల్లో చాలామంది ముఖ్యంగా ఉద్యోగులు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎ్‌సఎస్‌), పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎ్‌సవై) వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో మదుపు చేస్తుంటారు. పాత పన్ను విధానంలో కొనసాగే వారికి మాత్రమే ఈ పెట్టుబడులపై ఆదాయ మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాలు దీర్ఘకాలిక కుటుంబ ఆర్థిక లక్ష్యాల సాధనతో పాటు ఆయా వ్యక్తులకు క్రమశిక్షణతో కూడిన పొదుపు విధానాలకు అలవాటు పడేలా చేస్తాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, స్వల్పకాలిక పన్ను లాభాలను పక్కన పెట్టి మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా ఈ పథకాల్లో ఇప్పటికే మదుపు చేస్తున్న వ్యక్తులు పాత పన్ను చెల్లింపు విధానంలో కొనసాగడమే మంచిది.


దీర్ఘకాలమే బెటర్‌

అలా అని కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన పని లేదు. కొద్దిగా రిస్క్‌ ఉన్నా మార్కెట్‌ ఆధారిత రాబడులు కావాలనుకునే మదుపరులు తమ పన్ను పొదుపు మొత్తాలను క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) పద్దతిలో ఈఎల్‌ఎ్‌సఎస్‌ లేదా మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న ఇతర ఈక్విటీ పథకాల్లో మదుపు చేయడం మంచిది. అయితే ఈఎల్‌ఎ్‌సఎస్‌ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాక్‌-ఇన్‌-పీరియడ్‌ ఉంటుదనే విషయం మర్చిపోవద్దు.

పీపీఎఫ్‌- ఎస్‌ఎ్‌సవై పథకాలు

ఏ మాత్రం రిస్క్‌ తీసుకోలేని దీర్ఘకాలిక మదుపరులు తమ పన్ను ఆదా పెట్టుబడుల కోసం పీపీఎఫ్‌ లేదా సుక న్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకాలను ఎంచుకోవడం మంచిది. ఈ రెండు పథకాల్లో చెల్లింపులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పథకాలపై లభించే వడ్డీ రేటు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మించి ఉంటుంది. కొత్త పన్ను విధానంలోనూ పీపీఎ్‌ఫపై లభించే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆడపిల్లల తల్లిదండ్రులకైతే ఎస్‌ఎ్‌సవై అనువైన దీర్ఘకాలిక పెట్టుబడి.


ఆరోగ్య బీమాను మరవద్దు

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా లేకపోతే మధ్య తరగతి ప్రజల ఆర్థిక భద్రతకూ ధీమా లేదు. మందులు, ఆస్పత్రుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చి హాస్పిటల్‌కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి. రోగాల్లాగే ఈ ఖర్చులూ ఏటికేటికి పెరిగి పోతున్నాయి. ఈ నేపపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆ మాటకొస్తే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇల్లూ, ఒళ్లూ గుల్లయ్యే ప్రమాదం ఉంది. కాకపోతే క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ఎక్కువగా ఉన్న కంపెనీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమే మంచిది. కాబట్టి మిగిలే పన్ను ఆదాలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమా కవరేజీ పెంచుకునేందుకు ఉపయోగించడం తెలివైన పని.

రిటైర్మెంట్‌ ప్రణాళికలు

నాలుగు రాళ్లు సంపాదించేటప్పుడే రిటైర్మెంట్‌ ఖర్చులు ప్లాన్‌ చేసుకోవాలి. లేకపోతే ఆ జీవితమూ నరకంగా మారుతుంది. ఎన్‌పీఎస్‌ లేదా పెన్షన్‌ పథకాలు ఇందుకు అత్యంత అనువైనవి. ఇవేవీ వద్దు, మాకు మార్కెట్‌పై మంచి అవగాహన ఉందనకుంటే, ఈ బడ్జెత్‌తో మిగిలే పన్ను మొత్తాన్ని ఏవైనా బ్లూచిప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేయండి. అయితే ఈ పెట్టుబడిలో రిస్క్‌ ఎక్కువ. మార్కెట్‌ కలిసి వస్తేనే ఈ పెట్టుబడుల్లో అధిక రాబడులు వస్తాయని మర్చిపోవద్దు. చేతిలో దండిగా నిధులు ఉన్న పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ రిస్క్‌ తీసుకోవాలి. సిప్‌ పద్దతిలో మదుపు చేస్తే రిస్క్‌ కూడా తగ్గుతుంది.

ఎమర్జెన్సీ ఫండ్‌

ఎప్పుడు ఏ ఖర్చులు వస్తాయో తెలియదు. కొన్ని ఖర్చులు చెప్పి రావు. ఉన్న పళంగా ముంచుకొస్తాయి. లేదా కొన్ని సార్లు ఉద్యోగాలు పోయి రోడ్డున పడొచ్చు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి వ్యక్తి లేదా కుటుంబం కొంత ఎమర్జెన్సీ ఫండ్‌ను ఉంచుకోవడం మంచిది. ప్రైవేటు ఉద్యోగులైతే కనీసం ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోవాలి. బడ్జెట్‌ పన్ను కోతలతో మిగిలే మొత్తాన్ని ఇందుకు మళ్లించడం మంచిదని నిపుణుల సూచన.


జీవిత బీమా కూడా ముఖ్యమే

ఎవరి జీవితాలూ శాశ్వతం కావు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అసలే తెలియదు. జరగరానిదేదైనా జరిగితే కుటుంబం ఆర్థిక భద్రత లేక రోడ్డున పడాల్సిందే. జీవిత బీమా ద్వారా ఈ పరిస్థితి నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. టర్మ్‌ పాలసీలను ఎంచుకుంటే తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ కవరేజీ లభిస్తుంది. పాత పన్ను విదానంలో ఈ ప్రీమియం చెల్లింపులకు పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బడ్జెట్‌తో మిగిలే తమ పన్ను ఆదాలో కొంత భాగాన్ని తనకు, తన కుటుంబానికి ఆర్థిక భద్రత చేకూర్చే జీవిత లేదా టర్మ్‌ పాలసీలవైపు మళ్లించడం మర్చిపోవద్దు. ఈ పెట్టుబడి మనం లేకపోయినా మన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 09 , 2025 | 04:09 AM