కృత్రిమ మేధ ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:47 AM
ఇండియాఏఐ మిషన్ తొలి వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్...

ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, ఏఐకోష ప్రారంభం
గంటకు రూ.67కే జీపీయూ సేవలు అందుబాటులోకి..
న్యూఢిల్లీ: ఇండియాఏఐ మిషన్ తొలి వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటా సెట్ ప్లాట్‌ఫామ్ ‘ఏఐకోష’తో పాటు దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్: ఈ వేదిక ద్వారా 18,000కు పైగా జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్)లతోపాటు క్లౌడ్ స్టోరేజ్, ఇతర ఏఐ సేవలను వినియోగించుకోవచ్చు. విద్యార్థులు, స్టార్ట్‌పలు, పరిశోధకులు, ప్రభుత్వ శాఖలు అందుబాటు ధరలో కంప్యూటింగ్ వనరులను ఉపయోగించుకోవడంతోపాటు దేశంలో ఏఐ మోడల్ ట్రైనింగ్, డెవల్‌పమెంట్‌ను వేగవంతం చేసేందుకు కేంద్రం ఈ మౌలిక వసతిని ప్రారంభించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యంత చౌకగా గంటకు రూ.67కే జీపీయూల వినియోగ సేవలను ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత చంద్రయాన్ మిషన్ తరహాలో చాలా తక్కువ ఖర్చుతో భారత్ సొంత ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకోనుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. అంతేకాదు, 3-4 ఏళ్లలో మేడ్ ఇన్ ఇండియా జీపీయూలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏఐకోష: ఇది సమగ్ర డేటాసెట్ ప్లాట్‌ఫామ్. అత్యంత నాణ్యమైన వ్యక్తిగతేతర డేటా సెట్ల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వేదిక దేశీయ అవసరాలకు అనుగుణమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు డెవలపర్లకు వనరులు, టూల్స్, నిపుణుల మార్గదర్శకత్వ సేవలను అందించనుంది.
ఇండియాఏఐ మిషన్: పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా దేశంలో ఏఐ ఆవిష్కరణలకు ఊతమివ్వడంతో పాటు సొంత ఏఐ ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.10,371 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ మిషన్‌ను ప్రారంభించింది. గత ఏడాది మార్చిలో కేంద్ర కేబినెట్ దీని ఆమోదం తెలిపింది.
Read More Business News and Latest Telugu News