H‑1B, H‑4 Visa Holders: హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ బాదుడు.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:11 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా పొందాలనుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి. ఇప్పటికే భారత్‌పై భారీ ఎత్తున సుంకాలను విధించారు. అంతటితో ట్రంప్ కోపం చల్లారలేదు. ఇప్పుడు భారతీయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా హెచ్ 1 బీ వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా పొందాలనుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
మన ఇండియన్ కరెన్సీలో అయితే, అక్షరాలా 88 లక్షల రూపాయలుపైనే చెల్లించాలి. ఈ మేరకు హెచ్ 1 బీ వీసాలకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం ఆదివారం నుంచి( సెప్టెంబర్ 21) అమల్లోకి వస్తుంది. 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. శుక్రవారం డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐటీ సంస్థలు హెచ్ 1బీ వీసా సిస్టమ్‌ను మ్యానిపులేట్ చేస్తున్నాయి. వీసా మోసాలకు పాల్పడుతున్నాయి. దాని కారణంగా కంప్యూటర్ సంబంధిత రంగాల్లో పని చేస్తున్న అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలుగుతోంది’ అని అన్నారు.
ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక ఆదేశాలు..
హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. ‘హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు ఉన్న మా ఉద్యోగులు రేపటి లోగా అమెరికాలోకి వచ్చేయాలి. హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు కలిగి.. ప్రస్తుతం బయటి దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి’ అని ఓ మెయిల్ ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, హెచ్ 1బీ వీసాలు ఉన్నవారు అమెరికాలోనే ఉండాలని అక్కడి న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. వీసాలకు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోవటం మంచిదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
అప్పుడు తప్పించుకున్నాడు.. 23 ఏళ్ల తర్వాత అనుకోని విధంగా..
భారతయులకు మరో షాకిచ్చిన ట్రంప్.. హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు