Share News

ఎల్‌ఐసీ లాభం రూ 19013 కోట్లు

ABN , Publish Date - May 28 , 2025 | 05:51 AM

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్‌లో రూ.1.85 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ...

ఎల్‌ఐసీ లాభం రూ 19013 కోట్లు

రూ.12 చొప్పున తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో చక్కటి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.19,013 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 38 శాతం పెరిగింది. అయితే ఇదే కాలంలో కంపెనీ స్థూల ఆదాయం మాత్రం రూ.2,50,928 కోట్ల నుంచి రూ.2,41,625 కోట్లకు పడిపోయింది. అయినా వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.12 చొపున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

ప్రీమియం ఆదాయం: గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.13,810 కోట్ల నుంచి రూ.11,069 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో రెన్యూవల్‌ ప్రీమియం ఆదాయం మాత్రం రూ.77,368 కోట్ల నుంచి రూ.79,138 కోట్లకు చేరింది.

సంవత్సరం మొత్తానికి: 202425 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎల్‌ఐసీ రూ.48,151 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.40,676 కోట్లతో పోలిస్తే ఇది ఇది 18 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.8,53,707 కోట్ల నుంచి రూ.8,84,148 కోట్లకు చేరింది.


రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్‌లో రూ.1.85 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ. ఇవిగాక రుణ పత్రాల్లోనూ రూ.80,000 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. పెట్టుబడుల విక్రయం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.73,000 కోట్ల రాబడులు ఆర్జించినట్టు కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం పెట్టుబడులు మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది.

రూ.54.52 లక్షల కోట్ల ఆస్తులు

గత ఏడాది మార్చి నాటికి రూ.51,21,887 కోట్లుగా ఉన్న ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఈ ఏడాది మార్చి నాటికి రూ.54,52,297 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి పాలసీదారులకు బోనస్‌ కోసం కంపెనీ రూ.56,190.24 కోట్లు కేటాయించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.3,234.37 కోట్లు ఎక్కువ.


ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:51 AM