IT Sector Surge in Hiring: ఐటీలో మళ్లీ నియామకాల జోరు
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:02 AM
భారత ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) రంగం క్రమంగా గాడిన పడుతోంది. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ప్రాజెక్టుల రాక కొద్దిగా ఊపందుకుంది. దీంతో ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలపై...
అడెకో ఇండియా
కోలుకుంటున్న ఐటీ మార్కెట్
హైదరాబాద్, విశాఖలపైనా కంపెనీల దృష్టి
ఏఐ నిపుణులకు యమ గిరాకీ
ముంబై: భారత ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) రంగం క్రమంగా గాడిన పడుతోంది. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ప్రాజెక్టుల రాక కొద్దిగా ఊపందుకుంది. దీంతో ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టాయి. గత ఆర్థిక సంవత్సరం (2024 -25) తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి ఆరు నెలల్లో నియామకాలు 27 శాతం పెరిగాయి. కంపెనీలకు మానవ వనరుల (హెచ్‌ఆర్) సేవలు అందించే అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు మరింత జోరందుకుంటాయని ఈ సంస్థ అంచనా. ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు క్రమంగా పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
చిన్న నగరాలకూ వ్యాప్తి: ఐటీ కంపెనీలు గతంలో నియామకాల కోసం పెద్ద నగరాలపైనే దృష్టి పెట్టేవి. ఇప్పుడు క్రమంగా విశాఖపట్నం, ఉదయపూర్, నాగపూర్, కోయంబత్తూర్, ఇండోర్ వంటి చిన్న నగరాలపైనా దృష్టి పెడుతున్నాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ చిన్న నగరాల నుంచి నియామకాలు 7 శాతం పెరిగినట్టు అడెకో ఇండియా నివేదిక తెలిపింది. అయినా కంపెనీలు ఇప్పటికీ బెంగళూరు, హైదరాబాద్, పుణె, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే ఎక్కువ మందిని నియమించుకుంటున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ నిపుణుల కోసం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ఐటీ కంపెనీలతో పోటీపడుతున్నాయి.
జీతాలూ పెరిగాయి: నియామకాలతో పాటు ఐటీ ఉద్యోగుల జీతాల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 5 శాతం పెరుగుల కనిపించింది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ప్రత్యేక డొమైన్స్‌లో అవసరమైన నైపుణ్యాలు దొరకడం ఇప్పుడు కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. భారీ జీతాలు ఇస్తామన్నా సరైన నిపుణులు దొరకడం లేదు. ఈ డొమైన్లలో పట్టున్న నిపుణుల కొరత ప్రస్తుతం 45 నుంచి 50 శాతం వరకు ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు యాభై ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు అడెకో ఇండియా తెలిపింది.
ఫ్రెషర్లకు మంచి
రోజులు
నిన్న మొన్నటి వరకు ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు చాలా వరకు పక్కన పెట్టాయి. ప్రధాన కంపెనీలు కూడా ఇచ్చిన ఆఫర్లను సైతం ఏదో ఒక పేరుతో పక్కన పెట్టేవి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరిస్థితి కొద్దిగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలలతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు 25 శాతం పెంచినట్టు అడెకో తెలిపింది. అయితే కంపెనీలు గతంలోలా అల్లాటప్పా కాలేజీలకు వెళ్లడం లేదు. మంచి పేరు ప్రతిష్ఠలున్న ఇంజనీరింగ్, టెక్నికల్ సంస్థలకు వెళ్లి ఫ్రెషర్లను తీసుకుంటున్నట్టు అడెకో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప చెప్పారు. అది కూడా అన్ని విభాగాల వారికి కాకుండా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి డొమైన్లలో ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్లకు మాత్రమే ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయి. దీనికి తోడు గతంలోలా ఆఫర్ లెటర్లు ఇచ్చి శిక్షణ ఇవ్వడం కాకుండా తమకు అవసరమైన డొమైన్లలో కాలేజీల్లోనే శిక్షణఇచ్చి మరీ జాబ్స్‌లోకి తీసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం