ఐటీ పరిశ్రమకీ సుంకాల భయం
ABN , Publish Date - Feb 25 , 2025 | 02:17 AM
భారత ఐటీ కంపెనీలకూ ట్రంప్ సుంకాల భయం పట్టుకుంది. ప్రపంచ ఉద్రిక్తతలూ ఇందుకు తోడయ్యాయి. అయునా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత ఐటీ కంపెనీల ఆదాయాలు 5.1 శాతం పెరిగి...
ఆదాయాల వృద్ధికి ఢోకా లేదు
2024-25లో రూ.24.5 లక్షల కోట్ల ఆదాయం
58 లక్షలకు చేరిన ఐటీ కొలువులు
2025-26లో ఆదాయం రూ.26 లక్షల కోట్లు ఉండే చాన్స్
ముంబై: భారత ఐటీ కంపెనీలకూ ట్రంప్ సుంకాల భయం పట్టుకుంది. ప్రపంచ ఉద్రిక్తతలూ ఇందుకు తోడయ్యాయి. అయునా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత ఐటీ కంపెనీల ఆదాయాలు 5.1 శాతం పెరిగి 28,260 కోట్ల డాలర్లకు (సుమారు రూ.24.5 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉందని నాస్కామ్ జాతీయ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ చెప్పారు. నాస్కామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అంతేకాదు.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఐటీ కంపెనీల ఆదాయాలు మరో 6.1 శాతం వృద్ధితో 30,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.26.10 లక్షల కోట్లు) మించి పోయే అవకాశం ఉందన్నారు.
1.26 లక్షల కొత్త కొలువులు
ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఈ-కామర్స్ కంపెనీలు అన్నీ కలిసి 1.26 లక్షల కొత్త కొలువులు కల్పించినట్టు రాజేశ్ చెప్పారు. దీంతో దేశ ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కూడా దేశ ఐటీ రంగంలో కొత్త కొలువుల కల్పన ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని నంబియార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఐటీ సేవల రంగంలో భారత కంపెనీల వాటా 58 శాతానికి చేరనుందన్నారు.
ఎగుమతులే సింహభాగం
ఈ ఆర్థిక సంవత్సరం భారత ఐటీ కంపెనీలకు వచ్చే 28,260 కోట్ల డాలర్ల ఆదాయంలో మెజారిటీ వాటా 22,440 కోట్ల డాలర్లు ఎగుమతుల ద్వారా రానుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 4.6 శాతం ఎక్కువని నంబియార్ చెప్పారు. ఎగుమతులతో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్ 7 శాతం పెరిగి 5.820 కోట్ల డాలర్లకు చేరనుంది. అలాగే మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయంలో 3,710 కోట్ల డాలర్లు ఐటీ సేవల కంపెనీల నుంచి, బీపీఎం కంపెనీల నుంచి 5,460 కోట్ల డాలర్లు, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ కంపెనీల నుంచి 5,560 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని నాస్కామ్ అంచనా.
అమెరికాదే అగ్రస్థానం
భారత ఐటీ ఎగుమతుల్లో ఇప్పటికీ అమెరికా వాటా 60 నుంచి 62 శాతం వరకు ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానపరమైన చర్యలు ఎక్కడ తమ ఎగుమతులను దెబ్బతీస్తాయోనని ఐటీ కంపెనీలు భయపడుతున్నాయి. ‘ప్రస్తుతం అమెరికా మార్కెట్ అగమ్యగోచరంగా ఉంది. అక్కడి కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో తెలియడం లేదు’ అని నంబియార్ చెప్పారు. అయితే ఇదే సదస్సులో ప్రసంగించిన ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాత్రం మన ఐటీ కంపెనీలపై ట్రంప్ హెచ్చరికల ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు. ట్రంప్ సుంకాలతో అమెరికా కంపెనీలు లాభపడితే.. పరోక్షంగా అది మన ఐటీ కంపెనీలకూ మేలు చేస్తుందన్నారు. అమెరికాలోని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 60 శాతం మంది స్థానికులని పరేఖ్ వెల్లడించారు.
నాస్కామ్ చీఫ్ రాజేశ్ నంబియార్
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News