Invest Karnataka 2025: ఇన్వెస్ట్ కర్ణాటక.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా, మహీంద్రా గ్రూపు భారీ పెట్టుబడులు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:56 PM
ఇన్వెస్ట్ కర్ణాటక పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్స్ మీట్‌కు భారీ స్పందన లభిస్తోంది. పునరుత్పాదక ఇంధనం, తయారీ, సెమీకండక్టర్లు, పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టేందుకు బడా సంస్థలు ముందుకొచ్చాయి.

కర్ణాటక (Karnataka)లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో పలు దేశీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇన్వెస్ట్ కర్ణాటక పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్స్ మీట్‌కు భారీ స్పందన లభిస్తోంది. పునరుత్పాదక ఇంధనం, తయారీ, సెమీకండక్టర్లు, పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టేందుకు బడా సంస్థలు ముందుకొచ్చాయి. జేఎస్‌డబ్ల్యూ (JSW) నియో ఎనర్జీ, బాల్డోటా స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, మహీంద్రా సస్టెన్ మరియు ఎప్సిలాన్ గ్రూప్ సంస్థలు కర్ణాటకలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. (Invest Karnataka 2025)
సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు, బ్యాటరీ నిల్వ, బ్లేడ్ తయారీ, విండ్ టర్బైన్ జనరేటర్ ప్లాంట్ కోసం రూ. 56,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ప్రకటించింది. ఇన్వెస్ట్ కర్ణాటక పేరుతో జరిగిన ఇన్వెస్టర్ల మీట్‌లో ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఇక, రాబోయే సంవత్సరాల్లో జిందాల్ గ్రూప్ కర్ణాటకలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుందని స్టీల్ దిగ్గజం సజ్జన్ జిందాల్ ప్రకటించారు. ఇందులో రూ. 45,000 కోట్లు ఉక్కు ఉత్పత్తికి, రూ. 56, 000 కోట్లు హాస్పిటాలిటీ, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఇతర పర్యావరణ అనుకూల వెంచర్లకు కేటాయించినట్టు ఆయన చెప్పారు.
మహీంద్రా గ్రూప్ కూడా కర్ణాటకలో రూ.35 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, ఈ పెట్టుబడిని పునరుత్పాదక ఇంధన వనరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. 5 గిగావాట్లకు పైగా సౌర, హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తమ పెట్టుబడుల కారణంగా 6 నుంచి 8 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని, కర్ణాటకను క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు కీలక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..