Indian Pharma Industry: 2047 నాటికి ఫార్మా పరిశ్రమ రూ.45 లక్షల కోట్లకు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:26 AM
భారత ఫార్మా పరిశ్రమ 2047 నాటికి 50,000 కోట్ల డాలర్ల (రూ.45 లక్షల కోట్లు) పరిశ్రమగా మారడం ద్వారా వికసిత్ భారత్ సాధనలో కీలకంగా మారనున్నదని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి...
డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: భారత ఫార్మా పరిశ్రమ 2047 నాటికి 50,000 కోట్ల డాలర్ల (రూ.45 లక్షల కోట్లు) పరిశ్రమగా మారడం ద్వారా వికసిత్ భారత్ సాధనలో కీలకంగా మారనున్నదని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఫార్మసీగా పేరొందిన భారత్ రాబోయే రోజుల్లో ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్‌కు ప్రపంచ హబ్‌గా మారాలంటే మరింతగా రిస్క్ క్యాపిటల్ అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. కాగా 2026 సంవత్సరంలో ఫార్మా రంగం వృద్ధి అవకాశాలు సానుకూలంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. శాస్ర్తీయ ఆధిపత్యం, నియంత్రణాపరమైన వేగం, సహకార స్ఫూర్తితో సాగే ఇన్నోవేషన్ భవిష్యత్తులో కూడా కొనసాగుతాయన్నారు. వెలుపలి ఒత్తిడులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ రంగం నిలకడగా ముందుకు సాగుతూ ప్రపంచానికి జీవనాధార ఔషధాలను అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఊబకాయం, మధుమేహ ఔషధాలే కీలకం రాబోయే కాలంలో ఊబకాయం, మధుమేహ నివారణ ఔషధాలే దేశీయ ఫార్మా రంగం వృద్ధికి చోదక శక్తులుగా ఉంటాయని సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ కృతి గనోర్కర్ అన్నారు. జెనరిక్ ఔషధాల దిగ్గజంగా పేరొందిన భారత్ ఇప్పుడు ఊబకాయ నిరోధక పరిశ్రమకు ప్రపంచ కేంద్రంగా మారుతోందని ఆమె చెప్పారు. గ్లూకోగాన్-లైక్ పెప్టైడ్-1 వంటివి ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించి టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయ చికిత్సకు ఎంతో సహాయకారిగా ఉంటాయని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీఎల్‌పి-1 ఔషధాలే ఫార్మా పరిశ్రమ వృద్ధికి చోదకంగా ఉంటాయని కృతి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత