Share News

India Food Services Market: విందు మహా పసందు

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:34 AM

వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) భారత ఆహార సేవల మార్కెట్‌ 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.11.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. అలాగే, సంఘటిత ఆహార సేవల విభాగ పరిమాణం...

India Food Services Market: విందు మహా పసందు

బయట బాగా లాగించేస్తున్న భారతీయులు

2030 నాటికి రూ.11.25 లక్షల కోట్లకు దేశీయ ఆహార సేవల మార్కెట్‌

స్విగ్గీ, కియర్నీ సంయుక్త నివేదిక అంచనా

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) భారత ఆహార సేవల మార్కెట్‌ 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.11.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. అలాగే, సంఘటిత ఆహార సేవల విభాగ పరిమాణం ఐదేళ్లలో రెట్టింపు కానుందని, అసంఘటిత విభాగాన్ని మించిపోనుందని అంటోంది. ‘హౌ ఇండియా ఈట్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, అమెరికన్‌ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కియర్నీ సంయుక్తంగా ఈ నివేదికను గురువారం విడుదల చేశాయి. 2019లో 4,900 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత ఆహార సేవల మార్కెట్‌ 2025లో 7,800 కోట్ల డాలర్ల (రూ.6.97 లక్షల కోట్లు) స్థాయి కి చేరి ఉండవచ్చని రిపోర్టు అంచనా. నివేదికలోని మరిన్ని విషయాలు..

  • వచ్చే ఐదేళ్లలో ఆహార సేవల మార్కెట్‌ మొత్తం వృద్ధిలో సంఘటిత విభాగ వాటా 60 శాతానికి మించిపోనుంది. తద్వారా అసంఘటిత విభాగ స్థాయిని అధిగమించనుంది.

  • తలసరి ఆదాయంతో పాటే దేశవాసులు ఆహార సేవల కోసం వెచ్చించే మొత్తం కూడా పెరగనుంది. వచ్చే 7 ఏళ్ల పాటు ఈ ఖర్చులో అధిక వృద్ధి నమోదు కానుంది.

  • భారత జీడీపీలో ఆహార సేవల మార్కెట్‌ వాటా కేవలం 1.9 శాతమే. ప్రస్తుతం చైనాలో ఈ వాటా 5 శాతంగా, బ్రెజిల్‌లో 6 శాతంగా ఉంది. కాబట్టి, మున్ముందు భారత్‌లో ఈ మార్కెట్‌ వృద్ధికి బోలెడు అవకాశాలున్నాయి.

  • క్లౌడ్‌ కిచెన్లు, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (క్యూఎ్‌సఆర్‌), డెజర్ట్‌ పార్లర్లు సగటు కంటే అధిక వృద్ధిని నమోదు చేయనున్నాయి.

  • భారత కస్టమర్‌ వినూత్న వంటకాల ఆర్డర్లు 20 శాతానికి పైగా, రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్లు 30 శాతం వృద్ధి చెందాయి. మొత్తం ఆర్డర్లతో పోలిస్తే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ఆర్డర్లు 2.3 రెట్లు పెరుగుతున్నాయి.

  • భారతీయులు దేశీయ సంప్రదాయ వంటకాలతో పాటు విదేశీ వంటకాలనూ ఇది వరకెన్నడూ లేనంతగా ఆస్వాదిస్తున్నారు.

  • ప్రధాన వంటకాల కంటే గోవా, బిహారీ, పహారీ వంటకాలకు గిరాకీ 2-8 రెట్ల మేర పెరుగుతోంది. అదే సమయంలో కొరియా, వియత్నాం, మెక్సికన్‌ వంటకాలకు డిమాండ్‌ వరుసగా 17, 6, 3.7 రెట్ల చొప్పున పెరుగుతోంది.

  • దేశీయ పానీయాలైన బటర్‌మిల్క్‌, షర్బత్‌కు డిమాండ్‌ మొత్తం పానీయాలతో పోలిస్తే 4-6 రెట్లకు పైగా పెరుగుతోంది. బొబా టీ, మచ్చా టీ విక్రయాలు వరుసగా 11, 4 రెట్లు పెరిగాయి.

  • గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ఈ విభాగం అసమాన పరిణామాన్ని చూసింది. ఒకవైపు వినియోగదారులు భారత, ఇటాలియన్‌ వంటకాల్లో అందుబాటు ధరల కోసం చూస్తున్నారు. మరోవైపు బొబా, మచ్చా టీలను ఇదివరకెన్నడూ లేనంతగా సేవిస్తున్నారని స్విగ్గీ ఫుడ్‌ మార్కెట్‌ ప్లేస్‌ సీఈఓ రోహిత్‌ కపూర్‌ అన్నారు.

  • దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే, మిగతా నగరాల్లో బయట భోజనం చేయడం రెండు రెట్ల స్థాయిలో ఉందని కియర్నీ ప్రతినిధి రజత్‌ తులి అన్నారు. ప్రధానంగా కార్పొరేట్‌, పారిశ్రామిక, విద్య, పర్యాటక హబ్‌లలో ఇది అధికమన్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసేవారిలో జెన్‌ జెడ్‌ అధికమని, మిగతా వయసువాళ్లతో పోలిస్తే 3 రెట్ల చొప్పున పెరుగుతున్నారని తులి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 05:34 AM