BCG Report on Indian Content Creators: అయ్యో.. భారతీయ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల పరిస్థితి ఇదా.. తాజా నివేదికలో కీలక వివరాలు
ABN , Publish Date - May 04 , 2025 | 01:50 PM
భారతీయ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక స్థితిగతులపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పొందుపరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో కంటెంట్ క్రియేటర్ల హవా నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని రకరకాల కార్యక్రమాలతో ప్రోత్సహిస్తోంది. అనేక మంది యూట్యూబ్, ఇన్‌స్టా వంటి వేదికల ద్వారా డబ్బు సంపాదించడానికి ఉవ్విళ్లూరుతూ ఈ రంగంలో కాలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత కంటెంట్ క్రియేటర్ల సంపాదనపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఓ నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో సుమారు 2.5 మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు నిత్యం వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే వీరిలో కేవలం 8 నుంచి 10 శాతం మంది మాత్రమే తమ కంటెంట్‌ను సరిగ్గా మానెటైజ్ చేసుకుని ఆదాయం పొందగలుగుతున్నారు. మిగతా అందరూ చాలా స్వల్పస్థాయిలో ఆదాయం పొందుతున్నారు. కొందరికి రిక్తహస్తాలే మిగులుతున్నాయి.
కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోవడమే ఈ పరిస్థితికి కారణం. వ్యూవర్స్‌ను ఆకర్షించేందుకు మిలియన్ల కొద్దీ కంటెంట్ క్రియేటర్లు ప్రయత్నిస్తున్నా కొందరు మాత్రమే సుస్థిర ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. చాలా మందికి యాడ్‌లు, బ్రాండ్ స్పాన్సర్‌షిప్స్‌యే ప్రధాన ఆదాయ మార్గాలు. కానీ ఇవి టాప్ కంటెంట్ క్రియేటర్లకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి.
కంటెంట్ క్రియేటర్ల మధ్య ఆదాయంలో తేడాలు కూడా భారీగా ఉంటున్నాయి. అధికశాతం కంటెంట్ క్రియేటర్లు ప్రస్తుతం నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్నారు. చిన్న స్థాయి కంటెంట్ క్రియేటర్ల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ3.8 లక్షలు. ఇక మిలియన్ మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న వారు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తమ కంటెంట్‌తో జనాలను కట్టిపడేస్తూ బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర మార్గాల్లో నెలకు రూ.50 వేల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. కానీ ఇలాంటి కంటెంట్ క్రియేటర్ల సంఖ్య చాలా తక్కువ. భారత్‌లో ప్రతి 1000 వ్యూస్‌కు యాడ్ ద్వారా వచ్చే ఆదాయం రూ.50 నుంచి రూ.200 మధ్య ఉంటోంది. అంటే లక్ష వ్యూస్ వచ్చినా కూడా ఆదాయం మాత్రం రూ.5500 నుంచి రూ.20 వేల మధ్యే ఉంటున్నట్టు నివేదికలో తేలింది.
లైవ్ కామర్స్, వర్చువల్ గిఫ్టింగ్, సబ్‌స్క్రిప్షన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటివి మానెటైజేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు తెస్తున్నట్టు కూడా బీసీజీ నివేదిక పేర్కొంది. యూట్యూబ్ లైవ్, మోజ్, షేర్‌చాట్ వంటివి క్రియేటర్లు ఫ్యాన్సు నుంచి టిప్స్ రూపంలో డబ్బులు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నాయని బీసీజీ తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు వీక్షకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫైనాన్స్, విద్య, టెక్ రంగాలు.. టైర్ 2, టైర్ 3 నగరాల్లో పాప్యులర్ అవుతున్నాయి. భారత కంటెంట్ కారణంగా వినియోగదారులు సుమారు 350 నుంచి 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని కూడా నివేదిక వెల్లడించింది. ఈ మొత్తం 2023 కల్లా 1 ట్రిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా వేసింది.
ఇంతటి వ్యాపారం జరుగుతున్నా కంటెంట్ క్రియేటర్లకు మాత్రం కేవలం 20 నుంచి 25 బిలియన్లు మాత్రమే దక్కుతున్నాయి. వచ్చే పదేళ్లల్లో ఈ మొత్తం ఐదు రెట్లు కానుందని ఓ అంచనా. కంటెంట్ క్రియేషన్‌ను ఆదాయవనరుగా మార్చుకోవాలంటే కేవలం వ్యూస్ మాత్రమే టార్గెట్ చేయకుండా తమ వెంటే నడిచే నమ్మకమైన సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లను పెంచుకోవాలి. కేవలం యాడ్స్ ఆదాయంపైనే ఆధారపడకుండా, ఇతర మార్గాలా ద్వారా ఆదాయం పెంచుకోవాలని నివేదిక సూచించింది.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News