Share News

Indian Rupee Hits All Time Low: రూపాయి@ 91

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:06 AM

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి యధేచ్ఛగా దిగజారుతూనే ఉంది. మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరో 15 పైసలు క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి 90.93 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రాడేలో...

Indian Rupee Hits All Time Low: రూపాయి@ 91

డాలర్‌ మారకంలో ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపీ

ఇంట్రాడేలో ఏకంగా 91.14 స్థాయికి

చివరికి 15 పైసల నష్టంతో 90.93 వద్ద క్లోజింగ్‌

10 ట్రేడింగ్‌ సెషన్లలో 90 నుంచి 91కి

త్వరలోనే 92 స్థాయికి పడిపోయే చాన్స్‌!

న్యూఢిల్లీ: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి యధేచ్ఛగా దిగజారుతూనే ఉంది. మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరో 15 పైసలు క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి 90.93 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రాడేలో 36 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ఠ స్థాయి 91.14 వరకు కూడా దిగజారింది. కేవలం 10 ట్రేడింగ్‌ సెషన్లలోనే డాలర్‌ మారకం లో రూపాయి 90 నుంచి 91 స్థాయికి పడిపోయింది. కేవలం ఐదు సెషన్లలోనే 1 శాతం మేరకు నష్టపోయింది. డాలర్‌ బలహీనత, క్రూడాయిల్‌ ధరల తగ్గుదల సైతం రూపాయి పతనాన్ని నిలువరించలేకపోయాయి. మంగళవారం బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 1.54 శాతం దిగజారి 59.63 డాలర్లకు దిగివచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలలోనే రూపాయి 92 కన్నా దిగజారవచ్చని ఫారెక్స్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. కాగా బుధవారం రూపాయి కదలికలు 90.75 -91.25 మధ్యన ఉండవచ్చని విశ్లేషకులంటున్నారు. ఇదిలా ఉండగా 2027 జూన్‌ నాటికి రూపాయి 92-94 స్థాయికి దిగజారవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ నీలకంఠ్‌ మిశ్రా అంచనా వేస్తున్నారు. అయితే రూపాయి ఎంత దిగజారినా మనం భయపడాల్సిందేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. మనం 68,500-69,000 కోట్ల డాలర్ల భారీ విదేశీ మారకపు నిల్వలతో అత్యంత శక్తివంతంగా ఉన్నామని ఆయన అన్నారు.

ఎందుకు ఈ పతనం: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్‌ చేసిన కొత్త ప్రతిపాదనలను స్వీకరించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించలేదన్న వార్తలు రూపాయి మారకాన్ని ప్రభావితం చేశాయని ఫారెక్స్‌ ట్రేడర్లంటున్నారు. సరికొత్త ప్రతిపాదనలను భారత్‌ ఖరారు చేసే వరకు డీల్‌ నిలిచిపోయినట్టే అన్న భయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశా యి. మరోపక్క రూపాయి పతనాన్ని నిలువరించేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవడం వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నిధులు ఉపసంహరించడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.


2017 నుంచి క్షీణతే...

ఈ ఏడాది డిసెంబరు 3వ తేదీ వరకు రూపాయి విలువ 5.1ు క్షీణించిందని మంత్రి పంకజ్‌ వెల్లడించారు. వివిధ సంవత్సరాల్లో రూపాయి ట్రెండ్‌ను వివరిస్తూ 2015 సంవత్సరంలో 4.5ు, 2016లో 2.6ు దిగజారిన దేశీయ కరెన్సీ 2017లో 6.4ు పెరిగిందన్నారు. అయితే 2017 నుంచి రూపీ విలువ క్షీణిస్తూనే వచ్చింది. రూపీ 2018లో 8.5ు, 2019లో 2.3ు, 2020లో 2.3ు, 2021లో 1.7ు, 2022లో 10.2ు, 2023లో 0.6ు, 2024లో 2.8ు క్షీణించిందని తెలిపారు.

వాణిజ్య లోటే కారణం

రూపాయి విలువ ఇంతగా పడిపోవడానికి వాణిజ్య లోటే కారణమని ప్రభుత్వం చెబుతోంది. మంగళవారం రూపాయి నిరంతర పతనం అంశాన్ని కొందరు సభ్యులు రాజ్యసభలో ప్రస్తావించగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదురి ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది రూపాయి విలువను వాణిజ్య లోటు, అమెరికాతో వాణి జ్య ఒప్పందం ప్రభావితం చేశాయని మంత్రి చెప్పారు. రూపాయి విలువ క్షీణత వల్ల ఎగుమతి రంగం పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో దిగుమతుల విలువ పెరగవచ్చని కూడా ఆయన అంగీకరించారు. రూపాయి విలువను మార్కెట్‌ నిర్ణయిస్తుందని, దానికి ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే రూపాయి కదలికలను ఆర్‌బీఐ నిరంతరం ట్రాక్‌ చేస్తున్నదని, ఆటుపోట్లు తీవ్రంగా ఉంటే అవసరమైన మేరకు జోక్యం చేసుకుంటుందని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 17 , 2025 | 06:06 AM