Share News

India Growth Rate: భారత్ 12.2 శాతం వృద్ధి రేటు సాధించకపోతే కష్టమే.. మోర్గన్ స్టాన్లీ హెచ్చరిక

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:00 PM

భారత్‌లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 12.2 శాతం వృద్ధి రేటు తప్పనిసరి అని మోర్గన్ స్టాన్లీ సంస్థ హెచ్చరించింది. లేకపోతే సామాజిక ఒత్తిడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

India Growth Rate: భారత్ 12.2 శాతం వృద్ధి రేటు సాధించకపోతే కష్టమే.. మోర్గన్ స్టాన్లీ హెచ్చరిక
Morgan Stanley India growth warning

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఆర్థిక వ్యవస్థ 12.2 శాతం వృద్ధి రేటుతో పెరగాల్సిందేనని ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గన్ స్టాన్లీ స్పష్టం చేసింది. లేని పక్షంలో లక్షల కొద్దీ భారతీయ యువతకు తమ సామర్థ్యాలకు తగిన అవకాశాలు లేక సామాజిక ఒత్తిడులు పెరిగే అవకాశం ఉందని చేతన్ అహ్యా సారథ్యంలోని మోర్గన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు హెచ్చరించారు (Morgan Stanley India growth warning).

నిరుద్యోగితతో పాటు అండర్ ఎంప్లాయ్‌మెంట్‌ సమస్య భారత ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతున్నాయని మోర్గన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు హెచ్చరించారు. యువత నైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థాయిలో ఉద్యోగఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని అండర్ ఎంప్లాయ్‌మెంట్ అని అంటారు.

ఇక భారతీయ యువత నిరుద్యోగిత రేటు 17.7 శాతంగా ఉందని తెలిపారు. అనేక మంది వ్యవసాయ రంగం వైపు మళ్లుతుండటంతో ఈ రంగంలో ఉపాధి రేటు గత 17 ఏళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకుందని అన్నారు (jobs trap India).


వ్యాపారాభివృద్ధి, ఎగుమతుల్లో వృద్ధి, మౌలికవసతుల కల్పన, నైపుణ్యాలు పెంచేందుకు భారీ స్థాయిలో సంస్కరణలు, వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటుకు భారత్ తక్షణం నడుం బిగించాలని అన్నారు. లేని పక్షంలో భారత్ నిరుద్యోగిత ఉచ్చులో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా ఉండాలనుకుంటున్న కల సాకారమయ్యేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. వలసలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు (India's Required Growth Rate 12.2%).

ఈసారి భారత వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం వరకూ ఉండొచ్చని భారత్ అంచనా వేస్తోంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇంది ఎంత మాత్రం సరిపోదు. పైపెచ్చు, అమెరికా సుంకాలు, వీసాపై ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ఇక జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం కలిసొచ్చే అంశం. అయితే, రాబోయే దశాబ్దంలో కొత్తగా 84 మిలియన్‌ల మంది యువత జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారు. ఈ మేరకు అవకాశాలు కల్పించే స్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదని మోర్గన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 08:37 PM