చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు భారత్ పోటీ
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:54 AM
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దిగ్గజాలకు సవాలు విసిరేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, చైనా తాజా సంచలనం డీప్‌సీక్ ఆర్1, గూగుల్ జెమినీతో పాటు ఇతర జెనరేటివ్ ఏఐ...

10 నెలల్లో సొంత ఫౌండేషనల్ మోడల్ అభివృద్ధి
కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దిగ్గజాలకు సవాలు విసిరేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, చైనా తాజా సంచలనం డీప్‌సీక్ ఆర్1, గూగుల్ జెమినీతో పాటు ఇతర జెనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు పోటీగా భారత్ సొంత ఫౌండేషనల్ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. వచ్చే పది నెలల్లో ఇది సిద్ధం కానుందని కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఉత్కర్ష్ ఒడిశా సదస్సులో వెల్లడించారు. కృత్రిమ మేధ సాంకేతికతలో స్వయం సమృద్ధి దిశగా భారత ప్రయాణంలో ఇది కీలక మైలురాయి కానుందన్నారు. సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) అభివృద్ధికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ సిద్ధంగా ఉందని.. భారత వినియోగదారుల వినూత్న అవసరాల తీర్చే వ్యవస్థను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టిసారించిందన్నారు. గత వారం విడుదలైన ఓపెన్‌సోర్స్ మోడల్ డీప్‌సీక్ ఆర్1.. ప్రపంచవ్యాప్త సాంకేతిక నిపుణుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అంతేకాదు, ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐ సహా అమెరికన్ సిలికాన్ కంపెనీల ఆధిపత్యానికి సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.
18,693 జీపీయూల సమీకరణ: చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి ఏఐ మోడళ్ల అభివృద్ధికి అత్యాధునిక జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్)లు వేల సంఖ్యలో అవసరం. ఎందుకంటే, ఏఐ మోడల్ ట్రైనింగ్‌కు ఈ ఆధునిక జీపీయూలే కీలకం.
డీప్‌సీక్ ఏఐ మోడల్‌కు 2,500 జీపీయూలతో సమాచార ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇవ్వగా.. చాట్‌జీపీటీ అభివృద్ధికి ఏకంగా 25,000 జీపీయూలను వినియోగించారు. భారత్ సొంత ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పటివరకు 18,693 జీపీయూలను సమకూర్చుకుంది. అందులో 10,000 జీపీయూలు ఇప్పటికే అందుబాటులో ఉండగా.. త్వరలో మరిన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఏఐ మోడల్ అభివృద్ధి కోసం కామన్ కంప్యూటింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News