Share News

2028 నాటికి భారత్‌@:3

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:29 AM

భారత్‌ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.495 లక్షల కోట్లు) చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ మోర్గాన్‌....

2028 నాటికి భారత్‌@:3

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే చాన్స్‌ జూ మోర్గాన్‌ స్టాన్లీ

న్యూఢిల్లీ: భారత్‌ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.495 లక్షల కోట్లు) చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. 2023లో 3.5 లక్షల కోట్ల డాలర్లున్న భారత ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి 4.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఫలితంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాతి స్థానంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.

అత్యంత ఆకర్షణీయ వినియోగ మార్కెట్‌గా మారడం, ప్రపంచ ఉత్పాదకతలో తన వాటా పెంచుకోవడం, విధానపరమైన మద్దతుతో సాధించిన స్థూల ఆర్థిక స్థిరత్వం, మెరుగైన మౌలిక వసతులు ఇందుకు కారణమని తాజా నివేదికలో తేల్చి చెప్పింది. 1990లో 12వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ 2000 నాటికి 13వ స్థానానికి దిగజారింది. ఆ తర్వాత తిరిగి పుంజుకుని 2020 నాటికి 9వ స్థానానికి, 2023 నాటికి ఐదో స్థానానికి చేరింది. ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా ప్రస్తుతం 3.5 శాతం ఉండగా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది.


వృద్ధి గమనంలో మూడు ధోరణులు

భారత వృద్ధి గమనాన్ని మూడు ధోరణులుగా మోర్గాన్‌ స్టాన్లీ వర్గీకరించింది. ఒకటి బేర్‌, రెండోది బేస్‌, మూడోది బుల్‌ దశ. బేర్‌ దశలో అయితే ప్రస్తుతం 3.65 లక్షల కోట్ల డాలర్లున్న ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 6.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.అదే బేస్‌ దశలో అయితే 8.8 లక్షల కోట్ల డాలర్లకు, బుల్‌ దశలో అయితే 10.3 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని జోస్యం చెప్పింది. 2025లో 2,514 డాలర్లున్న తలసరి జీడీపీ సైతం బేర్‌ దశలో 4,247 డాలర్లకు, బేస్‌ దశలో 5,683 డాలర్లకు, బుల్‌ దశ లో 6,706 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది.

మరో పావు శాతం రెపో కోత ఖాయం

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) క్రమంగా ద్రవ్య విధానంపై పట్టు సడలిస్తోందని పేర్కొంటూ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినందు వల్ల ఏప్రిల్‌ సమీక్షలో రెపో రేటును మరో 0.25ు తగ్గించవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్‌బీఐ రెపోరేటును ఒక పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే.


ఈ ఏడాది

వృద్ధి 6.3%

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3ు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5ు వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది. గత కొద్ది వారాల్లో ప్రధాన ఆర్థిక సూచీల కదలికలు మిశ్రమంగా ఉన్నప్పటికీ రెండు నెలల క్రితం పరిస్థితి కన్నా చాలా మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. రాబోయే కాలంలో రికవరీ విస్తృత స్థాయిలో ఉంటుందని, బడ్జెట్లో ప్రకటించిన ఐటీ కోతలు పట్టణ డిమాండ్‌ను పెంచుతాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ, గృహ రంగాల్లోని పెట్టుబడులు వృద్ధికి ఊతం ఇస్తున్నాయంటూ కార్పొరేట్‌ పెట్టుబడులు కూడా క్రమంగా పుంజుకుంటున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 14 , 2025 | 04:29 AM