Income Tax Department: ఐటీ శాఖ నుంచి ఐటీఆర్-3
ABN , Publish Date - May 03 , 2025 | 05:30 AM
2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-3 ఫామ్‌ను విడుదల చేసింది. ఈ ఫామ్ ద్వారా వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయంపై పన్ను వివరాలు ఇవ్వాలని చెప్పారు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్) సంబంధించి ఐటీఆర్-3 ఫామ్‌ను విడుదల చేసింది. వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎ్‌ఫ) ఈ ఫామ్ ద్వారా తమ ఆదాయ, పెట్టుబడులు, ఖర్చులు, లాభాల వివరాలు వెల్లడించాలి. ఈసారి ఐటీఆర్-3 ద్వారా వెల్లడించాల్సిన ఆస్తుల విలువను ప్రస్తుత రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంచారు. దీంతో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులపై పెద్ద భారం తగ్గింది. ఈ ఫామ్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో మూలధన లాభాలు ఏమైనా ఉంటే అవి గత ఏడాది జూలై 23 తర్వాత వచ్చాయా? లేక అంతకు ముందే వచ్చాయా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఈ లాభాలపై ఇండెక్సేషన్ వద్దనుకుంటే 12.5 శాతం, కావాలనుకుంటే 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.