Share News

ప్రపంచ టాప్‌ 100లో హైదరాబాద్‌ విమానాశ్రయం

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:05 AM

భారత విమానయాన రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. పచ్చగా కళకళలాడుతూ, పరిశుభ్రంగా కనిపించడంలో దేశంలోని విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీ ...

ప్రపంచ టాప్‌ 100లో హైదరాబాద్‌ విమానాశ్రయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత విమానయాన రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. పచ్చగా కళకళలాడుతూ, పరిశుభ్రంగా కనిపించడంలో దేశంలోని విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ప్రపంచంలోని టాప్‌ 100 విమానాశ్రయాల జాబితాలో మన దేశంలోని నాలుగు విమానాశ్రయాలకు స్థానం దక్కింది. అంతర్జాతీయ ఎయిర్‌ ట్రావెల్‌ రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలిచింది. పరిశుభ్రత, స్నేహపూర్వకంగా వ్యవహరించే సిబ్బంది, ప్రయాణికుల అనుభూతిపరంగా ఈ ర్యాంకు దక్కించుకుంది. దేశంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయంగా పేరొందిన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక టెర్మినల్స్‌, కళాకృతుల ప్రదర్శన, సమర్థవంతమైన ఇమ్మిగ్రేషన్‌, మంచి కనెక్టివిటీతో 32వ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 48, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 73 స్థానాల్లో నిలిచాయి. టాప్‌ 100లో స్థానం సంపాదించడమే కాదు...గత ఏడాదితో పోల్చితే మన విమానాశ్రయాలు ర్యాంకింగ్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాయి.


ఢిల్లీ విమానాశ్రయం గత ఏడాది 36వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 32వ స్థానానికి ఎగబాకింది. అలాగే హైదరాబాద్‌ విమానాశ్రయం ర్యాంకింగ్‌ గత ఏడాదితో పోల్చితే 59వ స్థానం నుంచి 56వ స్థానానికి ఎదిగింది. అయితే ప్రపంచ టాప్‌ 20 విమానాశ్రయాల్లో మాత్రం మన దేశానికి చెందిన ఏ విమానాశ్రయానికి స్థానం దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన విమానాశ్రయంగా సింగపూర్‌కి చెందిన చాంగి ఎయిర్‌పోర్ట్‌ నిలిచింది. విలాసవంతంగా కనిపిస్తూ సౌకర్యం, వినోదంలో కూడా తిరుగులేనిదిగా పేరొందిన ఈ విమానాశ్రయానికి ఈ స్థానం దక్కడం ఇది 13వ సారి.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 06:05 AM