Share News

గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారా

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:11 AM

దేశ ఆర్థికాభివృద్ధిలో రవాణా రంగం పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా వస్తు రవాణా సేవలు (ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌) సరిగా లేకుంటే ఏ ప్రాంతంలో కూడా పారిశ్రామికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరగదు. ఒక ఫ్యాక్టరీకి ముడి సరుకు కావాలన్నా...

గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారా

దేశ ఆర్థికాభివృద్ధిలో రవాణా రంగం పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా వస్తు రవాణా సేవలు (ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌) సరిగా లేకుంటే ఏ ప్రాంతంలో కూడా పారిశ్రామికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరగదు. ఒక ఫ్యాక్టరీకి ముడి సరుకు కావాలన్నా, తయారైన వస్తువులు బయటకు పోవాలన్నా, ఒక వ్యాపారి సరుకు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా లేదా ఒక రైతు పండించిన పంటను అమ్ముకోవాలన్నా రవాణా సౌకర్యం లేకుంటే ఏదీ జరగదు. ఇంత ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌’కు సంబంధించి జీఎ్‌సటీ విధివిధానాలు, పన్ను రేటు వివరాలు మీ కోసం. ఇంతకు ముందు సర్వీస్‌ ట్యాక్స్‌లో కానీ ఇప్పుడు జీఎ్‌సటీలో కానీ వస్తు రవాణాకు సంబంధించి ‘గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ’ అనే ఒక సర్వీస్‌ ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే జీటీఏ అని అంటారు. జీఎ్‌సటీలో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీద విధించే పన్ను ఈ జీటీఏకు సంబంధించి ఉంటుంది. మరి జీటీఏ అంటే ఏమిటి? వస్తు రవాణా చేసే ప్రతి వాహనం జీటీఏ కిందకు వస్తుందా?

జీఎ్‌సటీ పరిభాషలో చెప్పాలంటే రోడ్డు ద్వారా వస్తు రవాణా చేస్తూ కన్‌సైన్‌మెంట్‌ నోట్‌ లాంటివి ఇచ్చే వ్యక్తి లేదా సంస్థను గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ అంటారు. మరి కన్‌సైన్‌మెంట్‌ నోట్‌ అంటే ఏమిటి? దీనికి అటుఇటుగా నిర్వచించినప్పటికీ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన వ్యక్తి తన వాహనంలో రవాణా చేసే వస్తువులకు సంబంధించి ఇచ్చే రసీదు. ఇందులో వస్తువులు పంపే వ్యక్తి, స్వీకరించే వ్యక్తి, రవాణా అవుతున్న వస్తువుల వివరాలతో పాటుగా సరుకు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడకు రవాణా అవుతుందనే వివరాలు ఇందులో ఉంటాయి. కన్‌సైన్‌మెంట్‌ నోట్‌కు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటే ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్టర్‌ కన్‌సైన్‌మెంట్‌ నోట్‌ ఇస్తాడో.. ఆ వస్తువులకు సంబంధించిన పూర్తి బాధ్యత వస్తు విక్రయదారుని నుంచి ట్రాన్స్‌పోర్టర్‌కు బదిలీ అవుతుంది. ఆయా వస్తువులు గమ్యస్థానం చేరే వరకు వాటి సంరక్షణ బాధ్యత అతనిదే. కాబట్టి ఏ వాహనదారుడైతే కన్‌సైన్‌మెంట్‌ నోట్‌ ఇస్తాడో అతను మాత్రమే జీటీఏ కింద పరిగణించబడతాడు. అతను మాత్రమే జీఎ్‌సటీ పరిధిలోకి వస్తాడు. అంటే రోడ్డు మీద ఉండే చిన్న వాహనాలు, ఆటో సర్వీ్‌సలు జీటీఏ పరిధిలోకి రావు. ఎందుకంటే ఇవి సాధారణంగా ఎలాంటి కన్‌సైన్‌మెంట్‌ నోట్‌ ఇవ్వవు.


మరి జీటీఏ కిందకు వచ్చే వ్యక్తి ఎంత పన్ను కట్టాలి? జీటీఏకి సంబంధించి రెండు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వాడుకుంటే 12 శాతం లేకుంటే 5 శాతం చొప్పున పన్ను కట్టాల్సి ఉంటుంది.

అయితే జీటీఏ ఈ కింది కేటగిరిలోని వ్యక్తులకు సర్వీస్‌ అందజేస్తే సదరు సర్వీ్‌సను రివర్స్‌ చార్జ్‌ కింద పరిగణించి ఆయా సేవలు అందుకునే వ్యక్తులు 5 శాతం చొప్పున పన్ను కట్టాల్సి ఉంటుంది. అవేమిటంటే.. ఏదేనీ ఫ్యాక్టరీ, సొసైటీ, కో-ఆపరేటివ్‌ సొసైటీ, జీఎ్‌సటీ కింద రిజిస్టర్‌ అయిన వ్యక్తులు, బాడీ కార్పొరేట్‌, పార్ట్‌నర్‌షిప్‌ ఫర్మ్‌, క్యాజువల్‌ ట్యాక్సబుల్‌ పర్సన్‌ మొదలైనవి. అంటే, ఎప్పుడైతే ఒక జీటీఏ పైన తెలిపిన కేటగిరీలోని వ్యక్తులకు లేదా సంస్థలకు సరుకు రవాణా చేస్తేంటే.. ఆయా వ్యక్తులు లేదా సంస్థలు రివర్స్‌ చార్జ్‌ మెకానిజం (ఆర్‌సీఎం) కింద 5 శాతం పన్ను చెల్లించాలి. ఇలాంటి సందర్భంలో జీటీఏకి ఐటీసీ పొందే అర్హత ఉండదు. అంటే వారు కొనే లారీల మీద లేదా ఇతర సర్వీసుల మీద ఐటీసీ పొందే అర్హత కోల్పోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తనంతట తానే ట్యాక్స్‌ కడుతూ ఐటీసీ పొందే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ పన్ను 12 శాతం చొప్పున కట్టాలి. అంటే ఒక జీటీఏ తనంత తానే ట్యాక్స్‌ కట్టాలంటే (ఫార్వర్డ్‌ ట్యాక్స్‌ మెకానిజం) కచ్చితంగా 12 శాతం చెల్లించాలి. ఒకసారి ఈ విధానాన్ని ఎంచుకుంటే ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం అదే విధానంలో ఉండాలి.

అయితే 2022 జూలైలో దీనికి మళ్లీ సవరణ చేయటం జరిగింది. దీని ప్రకారం ఫార్వార్డ్‌ మెకానిజంలో రెండు రకాల ఆప్షన్స్‌ ఇవ్వటం జరిగింది. 5 శాతం, 12 శాతం అంటే జీటీఏ తనే ట్యాక్స్‌ కడుతూ ఐటీసీ పొందాలంటే 12 శాతం ఎంచుకోవాలి. ఒకవేళ 5 శాతం ఎంచుకుంటే ఐటీసికి అర్హత ఉండదు. ఇది ఏదీ కాకుండా సర్వీస్‌ పొందిన వ్యక్తి పన్ను కట్టాలంటే ఆర్‌సీఎం విధానాన్ని ఎంచుకోవాలి.


అప్పుడు కూడా ఐటీసీ అర్హత ఉండదు. మరి ఏ విధానం ఎంచుకున్నాడో ఎలా తెలవాలంటే.. తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాను ఎంచుకునే విధానానికి సంబంధించి అనెగ్జర్‌-గ ను మార్చి 15లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తాను ఏ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నది 2025 మార్చి 15లోపు తెలియజేయాలి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకసారి ఒక విధానాన్ని ఎంచుకుంటే ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం అదే విధానంలో కొనసాగాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:11 AM