ITC Rule Explained: ఐటీసీ 90 శాతం నిబంధన
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:58 AM
జీఎ్‌సటీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తీసుకోవటానికి నిబంధనలు ఎలా ఉన్నాయో.. తీసుకున్న క్రెడిట్‌ను వాడుకోవటానికి కూడా అలాగే...
జీఎ్‌సటీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తీసుకోవటానికి నిబంధనలు ఎలా ఉన్నాయో.. తీసుకున్న క్రెడిట్‌ను వాడుకోవటానికి కూడా అలాగే నిబంధనలు ఉన్నాయి. ఇందులో చాలా మంది పట్టించుకోని విషయం 99 శాతం నిబంధన. ఈ నిబంధన ఏమిటనేది ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
నవీన్ చంద్ర పేరుమోసిన బట్టల వ్యాపారి. రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో షోరూమ్స్ ఉన్నాయి. వ్యాపారం విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలోనూ అంతే కచ్చితత్వం పాటిస్తాడు. కట్టాల్సిన పన్నులను బకాయిలు లేకుండా సకాలంలో చెల్లించాలని తన సిబ్బందికి చెబుతుంటాడు. అలాంటిది జీఎ్‌సటీ డిపార్ట్‌మెంట్ నుంచి తనకు ఒక నోటీస్ అందింది. గడిచిన కొన్ని నెలల్లో తాను కట్టాల్సిన పన్ను మొత్తం అంటే 100 శాతం పన్నును ఐటీసీ ద్వారానే చెల్లించారనీ, జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఒక నెలలో టర్నోవర్ రూ.50 లక్షలు దాటితే చెల్లించాల్సిన పన్నులో 99 శాతం మాత్రమే ఐటీసీ ద్వారా చెల్లించి మిగతా మొత్తాన్ని నగదు రూపంలో అంటే క్యాష్ లెడ్జర్ ద్వారా చెల్లించాల్సి ఉండగా.. మొత్తం పన్నును ఐటీసీతో చెల్లించటం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని, కాబట్టి ఆ తేడా మొత్తాన్ని వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. తనకు చట్ట ప్రకారం అర్హత ఉన్న ఇన్‌పుట్స్ మీదనే క్రెడిట్ తీసుకున్నాడు. ఆ క్రెడిట్‌నే పన్ను చెల్లింపున కు ఉపయోగించాడు. పన్ను మొ త్తాన్ని క్రెడిట్ ద్వారా చెల్లించకూడదా? అని సందేహం వచ్చింది.
రూ.50 లక్షల టర్నోవర్ దాటితేనే..
ఏదేనీ నెలలో టర్నోవర్ రూ.50 లక్షలు మించితేనే అప్పుడు ఈ 99 శాతం నిబంధన అమల్లోకి వస్తుంది. అంటే చెల్లించాల్సిన పన్నులో 99 శాతానికి మించి ఐటీసీ వాడకూడదు. దీని అర్ధం మిగతా ఒక శాతం కచ్చితంగా నగదు చెల్లింపు ద్వారా అంటే క్యాష్ లెడ్జర్ ద్వారా చెల్లించాలి అని. మరి టర్నోవర్ అంటే ఏం తీసుకోవాలి? ఇందులో నెలలో జరిగిన మొత్తం సరఫరాల విలువ నుంచి పన్ను మినహాయింపు ఉన్న సరఫరాల విలువ, జీరో రేటెడ్ సరఫరాల విలువ మినహాయించాలి. (జీరో రేటెడ్ సరఫరా అంటే ఎగుమతులకు లేదా సెజ్‌లకు పంపిన సరఫరా). ఇలా మినహాయించగా మిగిలిన మొత్తాన్ని టర్నోవర్ కింద లెక్కించాలి. ఇలా లెక్కించిన టర్నోవర్ రూ.50 లక్షలు దాటితే ఈ రూల్ వర్తిస్తుంది. అలా అని రూ.50 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి కేసులోనూ ఈ 99 శాతం నిబంధన అమలవుతుందని అనుకోకూడదు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
మినహాయింపులున్నాయ్..
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ రిజిస్ట్రేషన్ పొందిన సంస్థ లేదా వ్యక్తి రూ.లక్షకు మించి ఆదాయ పన్ను చెల్లించి ఉన్నా లేదా గడచిన ఆర్థిక సంవత్సరం సదరు సంస్థ లేదా వ్యక్తి రూ.లక్షకు మించి రిఫండ్ పొంది ఉన్నా (ఈ రిఫండ్ అనేది ట్యాక్స్ చెల్లించకుండా చేసే జీరో రేటెడ్ సరఫరాలకు లేదా ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్‌కు సంబంధించినవై ఉండాలి) లేదా ఇప్పటి వరకు అయిన టర్నోవర్ మీద ఇప్పటికే నగదులో ఒక శాతానికి మించి కట్టి ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో ఈ రూల్ అమలు కాదు మిగతా అన్ని సందర్భాల్లోనూ ఎప్పుడైతే టర్నోవర్ రూ.50 లక్షలు దాటుతుందో అప్పుడు కనీసం ఒక శాతం పన్ను క్యాష్ లెడ్జర్ ద్వారా చెల్లించాలి.
కాబట్టి, జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్ పొందిన వ్యక్తులు.. ఐటీసీ తీసుకోవటానికి గల నిబంధనలతో పాటు తీసుకున్న క్రెడిట్‌ను ఎలా వాడాలి? ఎంత మేరకు వాడాలి? ఇతరత్రా నియమ నిబంధనలు కూడా తెలుసుకోవాలి.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి