Share News

Agricultural Trade: ఎరువులు పురుగు మందుల వ్యాపారాల్లో జీఎ్‌సటీ ఎలా

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:23 AM

మన దేశంలో ఇతర వ్యాపారాలతో పోల్చితే ఎరువులు, పురుగు మందుల వ్యాపారం కొంత భిన్నమైంది. మిగతా వ్యాపారాల్లో వినియోగదారులు అన్ని రకాల వారు ఉండగా ఈ వ్యాపారంలో అంతిమ వినియోగదారులు రైతులు మాత్రమే. అంతేకాకుండా ఇది...

Agricultural Trade: ఎరువులు పురుగు మందుల వ్యాపారాల్లో జీఎ్‌సటీ ఎలా

మన దేశంలో ఇతర వ్యాపారాలతో పోల్చితే ఎరువులు, పురుగు మందుల వ్యాపారం కొంత భిన్నమైంది. మిగతా వ్యాపారాల్లో వినియోగదారులు అన్ని రకాల వారు ఉండగా ఈ వ్యాపారంలో అంతిమ వినియోగదారులు రైతులు మాత్రమే. అంతేకాకుండా ఇది సీజనల్‌ వ్యాపారం. అంటే సంవత్సరం మొత్తం నడవదు. ఎక్కువగా అరువు మీద వ్యాపారం నడుస్తుంది. అంటే రైతులు తామ కొన్న ఎరువులు లేదా పురుగు మందులకు సంబంధించిన డబ్బులు పంట వచ్చిన తర్వాత ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ వ్యాపారానికి సంబంధించి జీఎ్‌సటీ గురించిన జాగ్రత్తలు ఏమిటి? పద్దు పుస్తకాలు ఎలా నిర్వహించలి? మొదలైన విషయాలు మీకోసం..

ఒకప్పుడు జిల్లా, మండల కేంద్రాల్లోనే ఈ దుకాణాలు ఉండగా ఇప్పుడు చిన్న గ్రామాల్లో కూడా ఉంటున్నాయి. రైతులు.. ముఖ్యంగా చిన్న,సన్నకారు రైతులు సీజన్‌ ప్రారంభంలో అరువు మీద ఎరువులు తెచ్చుకుని పంట వచ్చిన తర్వాత దుకాణదారులకు చెల్లిస్తారు. అంటే దుకాణదారులకు ఆ పైకం ఆలస్యంగా అందుతుంది. కాబట్టి ఈ దుకాణదారులు కూడా హోల్‌సేల్‌ వ్యాపారులకు, అలాగే హోల్‌సేల్‌ వ్యాపారులు కంపెనీలకు ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, కంపెనీలు సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ సరుకును హోల్‌సేల్‌ వ్యాపారులకు పంపిస్తారు. సదరు సరుకును అమ్ముకోవటానికి హోల్‌సేల్‌ వ్యాపారులకు సాధ్యమైనంత మేర గడువు ఇస్తుంది. అంటే ఈ సరుకుకు సంబంధించిన మొత్తాన్ని ఆలస్యంగా చెల్లించే వెసులుబాటు ఈ వ్యాపారులకు ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఇదే పద్ధతిలో రిటైల్‌ వ్యాపారులకు సరుకును ఇస్తుంటారు.


ఈ వ్యాపారంలో ఉన్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే కంపెనీలు ఎక్కువగా సరుకును హోల్‌సేల్‌ వ్యాపారులకు పంపిస్తుందని చెప్పుకున్నాం కదా. మరి అంత సరుకు అమ్ముడు పోకపోతే ఏమి చేయాలి? అందుకే అమ్ముడుపోని సరుకుని కొంత కాలం తర్వాత వెనక్కు తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇదే పద్ధతిలో హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారుల మధ్య కూడా ఉంటుం ది. అంటే, మిగతా వ్యాపారులతో పోలిస్తే ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి సరుకు వెనక్కి పంపించటం, అలా గే కొనుగోలుకు సంబంధించిన సొమ్ము ఆలస్యంగా చెల్లించటం.

మరి ఈ విధానంలో జీఎ్‌సటీకి సంబంధించి సమస్యలు ఏమిటంటే, ఒక వ్యాపారి తాను పొందిన సరుకు మీద ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందినప్పుడు ఇన్వాయిస్‌ తేదీ నుంచి 180 రోజుల లోపు అమ్మకందారునికి ఆ సరుకు తాలుకూ మొత్తం పన్నుతో సహా కలిపి చెల్లించాలి. అలా చెల్లించని పక్షం లో తీసుకున్న ఐటీసీ చెల్లుబాటు కాదు. కాబట్టి దాన్ని రివర్స్‌ చేసి తిరిగి ఎప్పుడైతే ఆ మొత్తం చెల్లిస్తాడో అప్పుడు ఆ క్రెడిట్‌ తిరిగి తీసుకోవాలి. ముందు చెప్పినట్లుగా ఈ వ్యాపారంలో ఎక్కువ సందర్భాల్లో 6 నెలలకు మించి గడువు ఇస్తుంటారు.

అలాంటప్పుడు సంబంధిత నిబంధనల ప్రకారం ఐటీసీ మొత్తం రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇన్వాయిస్‌ తేదీ నుంచి రివర్స్‌ చేయాల్సిన తేదీ వరకు తీసుకున్న ఐటీసీ మొత్తం వడ్డీ చెల్లించాలి. ఉదాహరణకు సరుకు తీసుకున్న ఇన్వాయుస్‌ తేదీ జనవరి 1 అనుకుంటే గరిష్ఠంగా జూన్‌ 29 లేదా 30 వరకు ఈ 180 రోజుల గడువు పూర్తవుతుంది. ఇన్వాయిస్‌ విలువ మొత్తం మీద రూ.లక్ష. దానిమీద ఐటీసీ రూ.18,000 అనుకుంటే మొత్తం రూ.1,18,000 ఈ తేదీ లోపులో చెల్లించి ఉండాలి. లేని పక్షంలో ఐటీసీ కింద తీసుకున్న రూ.18,000 దాంతో పాటుగా జనవరి 1 నుంచి వడ్డీ (18 శాతం) చొప్పున చెల్లించాలి. ఒకవేళ 180 రోజుల లోపు కొంత మొత్తం చెల్లించి ఉంటే, చెల్లించని భాగానికి సంబంధించిన ఐటీసీపై లెక్క ప్రకారం రివర్స్‌ చేయాల్సి ఉంటుంది వడ్డీతో సహా.


ఇక సరుకు వెనక్కి పంపేటప్పుడు అంటే ఒక హోల్‌సేల్‌ వ్యాపారి నుంచి పొందిన సరుకును రిటైల్‌ వ్యాపారి వెనక్కు పంపుతుంటే కొన్ని సందర్భాల్లో రిటైల్‌ వ్యాపారి డెబిట్‌ నోట్‌ జారీ చేస్తుంటాడు. ఇది తప్పు. క్రెడిట్‌ నోట్‌ లేదా డెబిట్‌ నోట్‌ను వాస్తవంగా సరుకు ఎవరైతే పంపారో వారే ఇవ్వాలి. అంటే ఈ సందర్భంలో సరుకు పంపింది హోల్‌సేల్‌ వ్యాపారి కాబట్టి ఇలా వెనక్కు వచ్చే సరుకు మేరకు ఒక క్రెడిట్‌ నోట్‌ రిటైల్‌ వ్యాపారికి తనే జారీ చేయాలి. క్రెడిట్‌ నోట్‌లో ఉన్న మొత్తం ఆ హోల్‌సేల్‌ వ్యాపారి తదుపరి రిటర్న్‌లో తగ్గించుకోవచ్చు. ఇలా చేయాలంటే రెండు నిబంధనలు ఉన్నాయి.

మొదటిది.. సదరు రిటైల్‌ వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకుకు సంబంధించిన ఐటీసీ రివర్స్‌ చేయాలి. అలాగే హోల్‌సేల్‌ వ్యాపారి తగ్గింపు చేసుకోవటం అనేది ఇన్వాయిస్‌ ఇచ్చిన తదుపరి ఆర్థిక సంవత్సరం నవంబరు 30 లోపులోనే చేసుకోవాలి. ఉదాహరణకు 2024 జనవరి 1న ఇన్వాయిస్‌ జారీ చేసి ఉంటే గరిష్ఠంగా 2024 నవంబరు 30 లోపు మాత్రమే క్రెడిట్‌ నోట్‌ మీద తగ్గింపు సాధ్యమవుతుంది.

ఇందులో ఇంకొక పద్ధతి ఏమిటంటే సరుకు వెనక్కు పంపే వ్యక్తి అంటే రిటైల్‌ వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకును అమ్మకం కింద చూపిస్తూ హోల్‌సేల్‌ వ్యాపారి పేరు మీద ఒక ఇన్వాయిస్‌ జారీ చేయవచ్చు. అప్పుడు ఆ ఇన్వాయి్‌సకు సంబంధించిన ట్యాక్స్‌ రిటైల్‌ వ్యాపారి తాను రిటర్న్‌లో చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా.. హోల్‌సేల్‌ వ్యాపారి ఆ మొత్తానికి సంబంధించిన ఐటీసీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రిటైల్‌ వ్యాపారి అమ్మకందారుడు, హోల్‌సేల్‌ వ్యాపారి కొనుగోలుదారుడిగా భావించాలి. సంబంధిత నియమ నిబంధనలను ఇద్దరూ పాటించాలి. అలాగే ఇవే నిబంధనలు హోల్‌సేల్‌ వ్యాపారి నుంచి కొనుగోలు చేసేటప్పుడు, తిరిగి వెనక్కు పంపేటప్పుడు వర్తిస్తాయి.


ఇంకొక సాధారణ విషయం, సాధారణంగా రిటైల్‌ వ్యాపారులు.. రైతుల నుంచి సరుకుకు సంబంధించి ఆలస్యాన్ని బట్టి వడ్డీ వసూలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆ వడ్డీ మీద కూడా పన్ను చెల్లించాలి. అంటే ఆ సరుకుకు ఎంత శాతం పన్ను వర్తిస్తుందో అంత శాతం ఈ వడ్డీ మీద కూడా చెల్లించాలి. ఈ నిబంధన కూడా కేవలం రిటైల్‌ వ్యాపారులకే కాకుండా అమ్మిన సరుకుకు సంబంధించి వడ్డీ, పెనాల్టీ ఎవరైతే వసూలు చేస్తారో వారందరికి వర్తిస్తుంది.

ముందుగా చెప్పినట్లు ఈ వ్యాపారంలో ఉండే వారు జీఎ్‌సటీ మీద సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా హోల్‌సేల్‌ వ్యాపారులు.. మండల, గ్రామీణ స్థాయిలో ఉండే వ్యాపారులకు సరైన అవగాహన కల్పిస్తే ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి..

సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 01:45 AM