Share News

ఉద్యోగాల వృద్ధి బారెడు.. జీతాల వృద్ధి చారెడు

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:56 AM

దేశంలో నిజ జీతాల వృద్ధి రేటుపై నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ వీర్‌మణి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడేళ్లలో దేశంలో ఉద్యోగ అవకాశాలు...

ఉద్యోగాల వృద్ధి బారెడు.. జీతాల వృద్ధి చారెడు

నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ వీర్‌మణి

న్యూఢిల్లీ: దేశంలో నిజ జీతాల వృద్ధి రేటుపై నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ వీర్‌మణి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడేళ్లలో దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిజ జీతాల్లో మాత్రం ఎదుగూ బొదుగూ లేదన్నారు. ఈ కాలంలో ఉద్యోగాల కల్పన జనభా వృద్ధికి మించి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2023 జూలై నుంచి 2024 జూన్‌ మధ్య జరిగిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎ్‌ఫఎస్‌) ప్రకారం 2023-24లో అన్ని వయసుల జనాబాలో పని చేసే జనాభా 43.7 శాతం ఉందన్నారు. 2017-18తో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే అధిక జనాభా మన దేశానికి ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని వీర్‌మణి స్పష్టం చేశారు. ఇందుకోసం మన విద్యా విధానంలో బోధన, శిక్షణను మెరగు పరుచుకోవడం అత్యంత ముఖ్యమన్నారు.


నైపుణ్యాల కొరతే కారణం: రెగ్యులర్‌ ఉద్యోగులతో పోలిస్తే గత ఏడేళ్లలో తాత్కాలిక ఉద్యోగుల జీతాల పెరుగుదలే బాగుందని వీర్‌మణి స్పష్టం చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లో సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఇందుకు మన విద్యా వ్యవస్థ కూడా కారణమన్నారు. ప్రత్యేక నైపుణ్యాల అవసరం ఉన్న కొన్ని రెగ్యులర్‌ ఉద్యోగాలకు ప్రస్తుతం అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలూ కలిసి రావాలని ఆయన కోరారు. ఇందుకోసం జిల్లా స్థాయి నుంచే పని ప్రారంభం కావాలన్నారు. ఉద్యోగుల నైపుణ్యాలు పెరిగితే ఉత్పాదకత, ఉత్పాదకత పెరిగితే ఉద్యోగుల నిజ జీతాలూ పెరుగుతాయని వీర్‌మణి అన్నారు.



Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

మిణుగురుల ప్రపంచంలోకి...

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 01:56 AM