Share News

Public Sector Banks,: ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు

ABN , Publish Date - Oct 28 , 2025 | 02:42 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్‌ఫడీఐ) పరిమితిని 49 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పెట్టుబడుల పరిమితి అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిందని...

Public Sector Banks,: ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు

ప్రస్తుత 20% పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్‌ఫడీఐ) పరిమితిని 49 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పెట్టుబడుల పరిమితి అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిందని.. దీనిపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను కూడా అభిప్రాయం కోరినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా కొలిక్కి రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పీఎ్‌సబీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితి 20 శాతంగా ఉంది. అంటే, ఈ పరిమితిని రెట్టింపునకు పైగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. కాగా, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం 74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉన్న సంగతి విదితమే.

మరిన్ని విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం ద్వారా దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్‌కు అనుగుణంగా పీఎస్‌బీలు మూలధన నిధులు సమకూర్చుకోగలుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ పరిమితిని గణనీయంగా పెంచినప్పటికీ, కనీసం 51 శాతం వాటా కలిగి ఉండటం ద్వారా పీఎస్‌బీలపై నియంత్రణాధికారాలను మాత్రం ప్రభుత్వం కలిగి ఉండనుంది. ఈ సెప్టెంబరు 30 నాటికి విదేశీ పెట్టుబడులు అత్యధికంగా కెనరా బ్యాంక్‌లో 12 శాతంగా ఉండగా.. అత్యల్పంగా యూకో బ్యాంక్‌లో దాదాపు సున్నాగా ఉన్నాయి.

12 పీఎస్‌బీలు.. రూ.171 లక్షల కోట్ల ఆస్తులు

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ సహా దేశంలో డజను పీఎ్‌సబీలున్నాయి. ఈ మార్చి నాటికి ఈ డజను పీఎ్‌సబీల ఆస్తుల మొత్తం విలువ దాదాపు 1.95 లక్షల కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.171 లక్షల కోట్లు. దేశీయ బ్యాంకింగ్‌ రంగ మొత్తం ఆస్తుల్లో 55 శాతానికి సమానమిది.


దేశీ బ్యాంకులపై అమితాసక్తి

గడిచిన కొన్నేళ్లలో దేశీయ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ పెట్టుబడులే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలో అతిపెద్ద ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజర్‌ బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌.. కేరళకు చెందిన ఫెడరల్‌ బ్యాంక్‌లో 9.99 శాతం వాటాను రూ.6,196 కోట్లకు దక్కించుకుంది. గల్ఫ్‌ ప్రాంత బ్యాంకింగ్‌ దిగ్గజం ఎమిరేట్స్‌ ఎన్‌డీబీ.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 60 శాతం వాటాను రూ.26,853 కోట్లకు చేజిక్కించుకుంది. యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ) రూ.13,483 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మధ్యనే తన వాటాను మరో 5 శాతం మేర పెంచుకుంది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌లో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలైన వార్‌బర్గ్‌ పింకస్‌, అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (ఏడీఐఏ) కలిసి రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.

కాగా, గడిచిన కొన్నేళ్లలో మొండి బకాయిలు గణనీయంగా తగ్గడంతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులకు దీటుగా లాభాలు ఆర్జిస్తుండటంతో ప్రభుత్వ బ్యాంకుల్లోనూ పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. వికసిత్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

బులియన్‌ మార్కెట్లో అనిశ్చితి

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 28 , 2025 | 02:42 AM