కొనుగోళ్లలో అదే జోరు!
ABN , Publish Date - May 01 , 2025 | 01:45 AM
బంగారం.. భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పండగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ల ఆనవాయితీ. ముఖ్యంగా అక్షయ తృతీయకు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే...
అక్షయ తృతీయ బంగారం విక్రయాల్లో 35% వృద్ధి.. పరిమాణం మాత్రం గత ఏడాది స్థాయిలోనే: జీజేసీ
న్యూఢిల్లీ: బంగారం.. భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పండగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ల ఆనవాయితీ. ముఖ్యంగా అక్షయ తృతీయకు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే బాగా కలిసివస్తుందని హిందువులు భావిస్తారు. గత ఏడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం రూ.లక్షకు చేరువలో ఉంది. అయినప్పటికీ, ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోళ్లు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దేశవ్యాప్తంగా విక్రయాల విలువలో 35 శాతం వరకు వృద్ధి నమోదు కావచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) అంచనా వేసింది. విక్రయాల పరిమాణం మాత్రం గత ఏడాదిలాగే 20 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అసోసియేషన్ చైర్మన్ రాజేశ్ రోక్డే అన్నారు. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం బుధవారం రూ.98,550 పలికింది. గత ఏడాది ఇదే పండుగ రోజున ధర రూ.72,300గా ఉంది. అంటే బంగారం ధర గత ఏడాది కాలంలో 36.30 శాతం మేర పెరిగితే 2020 ఏప్రిల్‌తో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగింది.
పాత బంగారం మార్చుకున్నారు..
దక్షిణాదిలో అక్షయ తృతీయ కొనుగోళ్లు ఉదయం నుంచే పెరిగాయని.. ఉత్తరాదిలో మాత్రం సాయంత్రానికి ఊపందుకున్నాయని జీజేసీ పేర్కొంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ సారి అనూహ్యంగా మంగళ సూత్రాలు, చైన్లతోపాటు వెండి పాత్రలకు డిమాండ్ అధికంగా కన్పించిందని రాజేశ్ రోక్డే తెలిపారు. వినియోగదారులు తమ అవసరం లేదా బడ్జెట్‌కు అనుగుణంగా ఆభరణాలు, నాణేలు, కడ్డీలు కొనుగోలు చేశారన్నారు. ఈసారి యువత కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపారన్నారు. కాగా, 50 శాతం కొనుగోళ్లలో వినియోగదారులు తమ పాత బంగారాన్ని మార్చుకున్నారని పీఎన్‌జీ జువెలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ అన్నారు.
హైదరాబాద్‌లో మిశ్రమ స్పందన
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అక్షయ తృతీయకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆభరణ విక్రయాల్లో మిశ్రమ స్పందన కన్పించింది. అధిక ధరల కారణంగా బంగారం కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపలేదని సికింద్రాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి ప్రతాప్ తెలిపారు. షాపులను సందర్శించిన కస్టమర్లలోనూ అధిక శాతం చిన్న మొత్తాల్లో కొనుగోళ్లు జరిపారని, వెండి కొనుగోలుకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఇక అధిక మొత్తంలో బంగారం కొనుగోళ్లలోనూ వివాహ సంబంధిత జువెలరీనే అధికమని పేర్కొన్నారు.
మొత్తం బిజినెస్ రూ.16,000 కోట్లు
ఈ సారి రూ.12,000 కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, రూ.4,000 కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరగవచ్చని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది.
కాస్త దిగొచ్చిన బంగారం
అక్షయ తృతీయ నాడు పసిడి ధరలు కాస్త దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.900 తగ్గి రూ.98,550కి పరిమితమైంది. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం అదే స్థాయిలో తగ్గి రూ.98,100 పలికింది. కిలో వెండి మాత్రం ఏకంగా రూ.4,000 తగ్గుదలతో రూ.98,000కు జారుకుంది. అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 1.31 శాతం జారి 3,273.90 డాలర్ల స్థాయికి పడిపోగా.. సిల్వర్ 32.33 డాలర్ల వద్ద ట్రేడైంది.
మార్చి త్రైమాసికంలో తగ్గిన డిమాండు
న్యూఢిల్లీ: అధిక ధరలు బంగారం గిరాకీకి గండికొట్టాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక పేర్కొంది. బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి భారత్‌లో పసిడి డిమాండ్ 15 శాతం తగ్గి 118.1 టన్నులకు పడిపోయింది. అధిక ధరల ప్రభావంతో విలువ మాత్రం 22 శాతం పెరిగి రూ.94,030 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం రేటు 25 శాతం ఎగబాకడమే ఇందుకు కారణం. ఒకదశలో 10 గ్రాముల ధర రూ.లక్ష దాటింది. ఇది బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపిందని నివేదిక అభిప్రాయపడింది. కాగా, ఈ ఏడాది భారత్‌లో పసిడి గిరాకీ 700-800 టన్నుల స్థాయిలో నమోదు కావచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.
Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..