Gold Rates On Oct 27: మరింత దిగువకు బంగారం ధరలు..
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:29 AM
అమెరికా-చైనా వాణిజ్య చర్చల సానుకూల సంకేతాల నడుమ నేటి ట్రేడింగ్ మొదలవగానే బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం
ఇంటర్నెట్ డెస్క్: ఊహించినట్టుగానే సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధరలు మరింతగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లల్లో పసిడి ధరల తగ్గుదల, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్ బలపడుతుండటం వెరసి మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో నేడు ట్రేడింగ్ మొదట్లో పసిడి ధరలు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 1140 మేర తగ్గి రూ. 1,24,480కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1050 మేర తగ్గి రూ.1,14,100 వద్ద తచ్చాడుతోంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి (Gold Rates on Oct 27).
అంతర్జాతీయ మార్కెట్‌లల్లో కూడా పసిడి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఔన్స్ బంగారం (24 క్యారెట్) స్పాట్ ధర రూ.0.7 శాతం మేర క్షీణించి 4,082.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 1 శాతం మేర తగ్గి 4,095.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి ధరలు మరింత తగ్గే ఛాన్సుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా, చైనా మధ్య సానుకూల వాతావరణంలో వాణిజ్య చర్చలు జరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండికి డిమాండ్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రామాణిక వడ్డీ రేట్ల కోత విషయంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తీసుకునే నిర్ణయం గురించి మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. వడ్డీ రేట్లల్లో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించే అవకాశం ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
Uncertainty in Bullion Market: బులియన్ మార్కెట్లో అనిశ్చితి
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి