Gold Prices Soar: వచ్చే ఐదేళ్లలో రూ 3 లక్షలకు బంగారం
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:35 AM
పసిడి ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం రేటు ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగి తొలిసారిగా 4,000 డాలర్ల మైలురాయిని దాటింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను...
2030 చివరికల్లా మరో 150% పెరిగే అవకాశం
మార్కెట్ నిపుణుడు ఎడ్ యార్దేని అంచనా
పసిడి ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం రేటు ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగి తొలిసారిగా 4,000 డాలర్ల మైలురాయిని దాటింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అలుముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలగేలా కన్పించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బులియన్ ధరలు మరింత పైకి దూసుకుపోతాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత గోల్డెన్ ర్యాలీ ఈ దశాబ్దం చివరి వరకు కొనసాగనుందని, 2030 సంవత్సరాంతానికల్లా ఔన్స్ బంగారం మరో 150 శాతం పెరిగి 10,000 డాలర్లకు చేరవచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణుడు ఎడ్ యార్దేని అంచనా వేశారు. ఈ లెక్కన, భారతీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర వచ్చే ఐదేళ్లలో రూ.3 లక్షలు (ప్రస్తుత కరెన్సీ మారకం రేటు ప్రకారం) దాటవచ్చు.
పసిడి ర్యాలీకి యెర్దేని చెబుతున్న కారణాలు
అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు
ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటుండటం
బులియన్‌లో పెట్టుబడులకు వ్యక్తిగత, సంస్థాగత ఇన్వెస్టరు గతంలో కంటే అధిక ఆసక్తి కనబరుస్తుండటం

రూ.1.24 లక్షలకు పసిడి
ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పాటు దేశీయ విపణిలోనూ పసిడి ధర సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మంగళవారం మరో రూ.700 పెరిగి రూ.1,24,000కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు సైతం రూ.700 పెరుగుదలతో ఆల్‌టైమ్ గరిష్ఠం రూ.1,23,400కు ఎగబాకింది. అమెరికా షట్‌డౌన్‌తో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో పాటు ఈ నెలలో ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలు గోల్డ్ రేట్లను ఎగదోస్తున్నాయి. కాగా, సిల్వర్ రికార్డు గరిష్ఠాల నుంచి కాస్త కిందికి జారింది. కిలో వెండి ఏకంగా రూ.3,400 తగ్గి రూ.1,54,000కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం తొలిసారిగా 4,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. వెండి మాత్రం 48 డాలర్లకు తగ్గింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి