Gold Rates today: కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Mar 19 , 2025 | 07:20 AM
భారత్‌లో పుత్తడి ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును చేరింది. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీనపడ్డ డాలరు, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితి వెరసి అనేక మందికి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మళ్లడంతో పసిడి ధర చారిత్రక గరిష్ఠాన్ని చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో బంగారం ధర భారీగా పెరిగి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. భారత్‌లో తొలిసారిగా పసిడి ధర రూ.90 వేల మార్కును చేరింది. దిగుమతులపై సుంకాల విధింపుతో అమెరికా మొదలెట్టిన వాణిజ్యం యుద్ధానికి బెదిరిపోతున్న మదుపర్లు తమ సంపదను బంగారం పెట్టుబడుల్లోకి మళ్లిస్తుండటంతో పుత్తడి ధరలకు రెక్కలొచ్చాయి. భారత్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర మునుపటితో పోలిస్తే రూ.440 పెరిగి రూ.90,000కి చేరుకోగా 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.82,500కు చేరుకుంది. వెండి ధరలు కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయి. కిలో వెండి రూ.1,04,000 చేరుకుంది (Gold Rates Today).
Also Read: రెండేళ్లలో అన్ని వైడ్ బాడీ విమానాలకు కొత్త రూపం
చెన్నైలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 90 వేలు దాటగా 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.82500గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ పసిడి ధర రూ.82,500గా 24 క్యారెట్ పుత్తడి ధర రూ90 వేలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 90,100గా 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.82510 వద్ద తచ్చాడుతోంది.
Also Read: ఆల్ఫాబెట్ రూ.2.77 లక్షల కోట్ల డీల్
డాలర్ బలహీనపడటం, ట్రంప్ సుంకాల విధింపు, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటివన్నీ బంగారం ధర పెరిగేలా చేస్తు్న్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌బీఐ విడుదల చేసే నివేదికలో ఆర్థికమందగమనం సూచనలు కనిపిస్తే పుత్తడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అమెరికా కేంద్ర బ్యాంకు పాలసీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మార్పులను అనుసరించి బంగారంపై పెట్టుబడులకు సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక, భౌగోళికరాజీయ అనిశ్చిత భవిష్యత్తులో మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్న వేళ పుత్తడి ధర మరింత పెరిగే అవకాశం కచ్చితంగా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read More Business News and Latest Telugu News