Gold Loan Demand: బంగారం రుణాలకు భారీ డిమాండ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:21 AM
చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, చిన్నమెత్తు బంగారం ఉంటే చాలు. ఏదో ఒక బ్యాంకు లేదా ఎన్‌బీఎ్‌ఫసీ దగ్గర కుదువ పెట్టి నాలుగు రాళ్లు అప్పుగా తీసుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. బంగారం ధరల...
రూ.14.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్
కొత్తగా 3,000 ఎన్‌బీఎ్‌ఫసీల బ్రాంచ్‌లు
న్యూఢిల్లీ: చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, చిన్నమెత్తు బంగారం ఉంటే చాలు. ఏదో ఒక బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ దగ్గర కుదువ పెట్టి నాలుగు రాళ్లు అప్పుగా తీసుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. బంగారం ధరల పెరుగుదలతో గత ఏడాది కాలంగా దేశంలోని గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా పెరిగిపోతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలోని గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలు బంగా రం ఆభరణాలు, బంగారాన్ని హామీగా పెట్టుకుని ఇచ్చిన రుణాల విలువ రూ.14.5 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువ. వచ్చే ఏడాది మార్చి నాటికి పసిడి రుణాల మార్కెట్ రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ పరపతి రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా.
మరింత డిమాండ్: మన దేశంలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు పసిడి ధర 60 శాతం పెరిగింది. ఇదే సమయంలో సూక్ష్మ రుణ సంస్థలు హామీ లేని రుణాలు ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు గోల్డ్ లోన్ కంపెనీల వైపు చూస్తున్నారు. బంగారం ధర కూడా పెరగడంతో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు బంగారం లేదా ఆభరణాల విలువలో 70 నుంచి 80 శాతం వరకు రుణాలుగా ఇస్తున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం గోల్డ్ లోన్ మార్కెట్ ఎంత లేదన్నా 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతుందని ఇక్రా అంచనా.
కొత్త శాఖలకు కసరత్తు
పసిడి రుణాలకు గిరాకీ పెరగడంతో ఎన్‌బీఎ్‌ఫసీలు, గోల్డ్ లోన్ కంపెనీలు వచ్చే ఏడాది దాదాపుగా 3,000 వర కు కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నా యి. ఇందులో 1,800 బ్రాంచ్‌లను ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఐఐఎ్‌ఫఎల్ ఫైనాన్స్ వంటి అగ్రశ్రేణి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలే ఏర్పాటు చేయనున్నాయి. పెరుగుతున్న మార్కెట్ అవకాశాలను దొరక పుచ్చుకునేందుకు ఇపుడు ఎల్ అండ్ టీ ఫైనాన్స్, పూనా వాలా ఫిన్‌కార్ప్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలూ సిద్ధమవుతున్నాయి. జియో ఫైనాన్స్ కూడా త్వరలో గోల్డ్ లోన్స్ మార్కెట్‌లో పాదం మోపుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద బులియన్ మార్కెట్ ర్యాలీ గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపార విస్తరణకూ తోడ్పడుతోంది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!