Gold Loan: గోల్డ్ లోన్.. ఇక ఈజీ కాదు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:49 AM
Gold Loan: బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటారా.. గోల్డ్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత...

త్వరలో నిబంధనలు కఠినతరం!!
న్యూఢిల్లీ: బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటారా..? గోల్డ్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ రుణాల మంజూరు ప్రక్రియలో నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపైనా కన్నేసి ఉంచాలని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలను ఆర్‌బీఐ ఆదేశించనున్నట్లు సమాచారం. అంతేకాదు, రుణగ్రహీతల బ్యాక్‌గ్రౌండ్‌నూ చెక్ చేయాలని, తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించనుందని సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్‌బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బ్యాంకుల పసిడి రుణాల్లో 50 శాతం వృద్ధి
ఈ మధ్య కాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబరు నుంచి బ్యాంకుల గోల్డ్ లోన్ వ్యాపారం 50 శాతం మేర పెరుగుతూ వస్తోంది. మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికమిది. గత ఏడాది ఆర్‌బీఐ తనఖారహిత వ్యక్తిగత రుణాల నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు పసిడి ధరలు వేగంగా పెరుగుతూ రావడం ఇందుకు కారణాలని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.89,000 స్థాయికి చేరుకుంది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు
భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. ప్రపంచలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం మనదే. పండగలు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మన వారికి బంగారమంటే కేవలం అలంకరణే కాదు ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార అత్యయిక, స్వల్పకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం. కరోనా కష్టకాలం నుంచే బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ వేగంగా పెరుగుతూ వచ్చింది. తనఖారహిత రుణాల మంజూరు కఠినతరం కావడంతో రుణగ్రహీతలు కూడా పసిడి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
పసిడి రుణాల
మంజూరులో అవకతవకలపై ఆర్‌బీఐ నజర్
పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై 2024 సెప్టెంబరు 30న ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ (ఎల్‌టీవీ) రేషియో, రిస్క్ వెయిటేజీ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాదు, రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిశీలించాలని రుణదాతలను ఆర్‌బీఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణ కాలపరిమితి రెన్యువల్‌నూ ఆర్‌బీఐ తప్పుపట్టింది.
Read More Business News and Latest Telugu News