Gold Investment: బంగారం ఈటీఎఫ్‌ల్లో యూలిప్స్ పెట్టుబడులు
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:28 AM
పసిడి ధరల జోరు జీవిత బీమా సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. బంగారం ధర గత పాతికేళ్లలో ఏకంగా 20 రెట్లు పెరిగింది. గత ఏడాది కాలంగా చూసినా బంగారం ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్...
ఐఆర్‌డీఏఐ అనుమతి కోరిన బీమా సంస్థలు
న్యూఢిల్లీ: పసిడి ధరల జోరు జీవిత బీమా సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. బంగారం ధర గత పాతికేళ్లలో ఏకంగా 20 రెట్లు పెరిగింది. గత ఏడాది కాలంగా చూసినా బంగారం ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోనూ మదుపరులు సగటున 30 శాతం రాబడులు కళ్లజూశారు. దీంతో తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాల (యూలిప్స్) పెట్టుబడుల్లో కనీసం 3 నుంచి 5 శాతమైనా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ)ను కోరాయి.
ఎందుకంటే?
బీమా కంపెనీలు ప్రస్తుతం నేరుగా పసిడిలోగానీ, గోల్డ్ ఈటీఎ్‌ఫల్లోగానీ మదుపు చేసేందుకు అనుమతి లేదు. యూలిప్స్ ద్వారా సమీకరించిన నిధులను ఈ సంస్థలు ఈక్విటీ, రుణ పత్రాలు, లిక్విడ్ డెట్ ఫండ్స్, లేదా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మాత్రమే పెట్టుబడులుగా పెడుతున్నాయి. గత ఏడాది కాలంలో ఈ పెట్టుబడులపై సగటున 5 నుంచి 8 శాతానికి మించి రాబడులు రాలేదు. ఇదే సమయంలో బులియన్ మార్కెట్ మాత్రం సగటున 30 శాతం వరకు రాబడులు ఇచ్చింది. దీంతో కనీసం పెట్టుబడుల వివిధీకరణ (డైవర్సిఫికేషన్) కోసమైనా గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులను అనుమతించాలని బీమా కంపెనీలు ఐఆర్‌డీఏఐను కోరుతున్నాయి. కాగా బీమా నియంత్రణ మండలి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.