Gold and Silver Prices Skyrocket: బంగారు నగ.. భగ భగ
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:25 AM
పండగ సీజన్‌లో పసిడి, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తులం బంగారం రూ.1.23 లక్షలు దాటేయగా..
పసిడి సరికొత్త ఆల్‌టైం రికార్డు
రూ.1.23 లక్షలు దాటిన 10 గ్రాముల ధర
ఒక్కరోజులో రూ.2,700 పెరుగుదల
న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో పసిడి, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తులం బంగారం రూ.1.23 లక్షలు దాటేయగా.. కిలో వెండి రూ.1.60 లక్షల దిశగా పరుగులు తీస్తోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం సోమవారం ఏకంగా రూ.2,700 ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.1,23,300కు పెరిగింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.2,700 పెరిగి కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,22,700కు చేరింది. వెండిదీ అదే తీరు. కేజీ సిల్వర్ రూ.7,400 పెరుగుదలతో మరో కొత్త రికార్డు గరిష్ఠ స్థాయి రూ.1,57,400కు ఎగబాకింది. ఖజానా ఖాళీ అవడంతో అమెరికా ప్రభు త్వ యంత్రాంగం స్తంభించిపోయి (యూఎస్ షట్‌డౌన్) 6 రోజులవుతుండటంతో పాటు డాలర్‌తో రూపా యి మారకం విలువ రికార్డు కనిష్ఠానికి క్షీణించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి.
4,000 డాలర్లకు చేరువలో ఔన్స్ గోల్డ్
షట్‌డౌన్‌తో అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి మరింత పెరగడంతో పాటు ఫ్రాన్స్, జపాన్‌లో తాజా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలను ఎగదోస్తున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరో 0.25 శాతం తగ్గించవచ్చన్న అంచనా లూ బులియన్ ర్యాలీకి మరో కారణం.ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు తొలిసారిగా 3,900 డాలర్ల మైలురాయిని దాటేసింది. సిల్వర్ సైతం ఒక శాతానికి పైగా పెరిగి 48.75 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగిన ఔన్స్ గోల్డ్ అతి త్వరలో 4,000 డాలర్లు మించిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి