Share News

EV Auto Rickshaws India: ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లకు భలే డిమాండ్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:01 AM

ప్రస్తుతం ఆటో రిక్షాల మార్కెట్లోనూ విద్యుత్‌ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. దీంతో అనేక స్టార్ట్‌ప్సతో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలూ ఈవీల బాటపట్టాయి. ఈ విభాగంలో...

EV Auto Rickshaws India: ఎలక్ట్రిక్‌  త్రీ వీలర్లకు భలే డిమాండ్‌

  • అమ్మకాల్లో ఏటా 30 శాతానికి పైగా వృద్ధి

  • కీలకంగా ఏపీ, తెలంగాణ

మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ ఎండీ సుమన్‌ మిశ్రా

ప్రస్తుతం ఆటో రిక్షాల మార్కెట్లోనూ విద్యుత్‌ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. దీంతో అనేక స్టార్ట్‌ప్సతో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలూ ఈవీల బాటపట్టాయి. ఈ విభాగంలో మహీంద్రా గ్రూప్‌ కంపెనీ మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ (ఎంఎల్‌ఎంఎం) ఇప్పటికే 38 శాతం వాటాతో తన హవాను కొనసాగిస్తోంది. ఈవీ త్రీ వీలర్‌ మార్కెట్లో వస్తున్న మార్పులు ఇతరత్రా అంశాలపై సంస్థ ఎండీ, సీఈఓ సుమన్‌ మిశ్రా ‘ఆంధ్రజ్యోతి బిజినె్‌స’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

తెలుగు రాష్ట్రాల్లో ..

మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మాకు అత్యంత కీలకమైన మార్కెట్లు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్ల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోని జహీరాబాద్‌ వద్ద ఈవీల తయారీ కోసం ఇప్పటికే రూ.1,000 కోట్లతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేశాం. సానుకూల ప్రభుత్వ విధానాలు, పట్టణ ప్రాంత రవాణా అవసరాలతో ఏపీలోనూ ఈవీ త్రీ వీలర్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అన్ని కంపెనీలు కలిపి నెలకు 800కు పైగా త్రీ వీలర్లు విక్రయిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సంస్థకు మొత్తం 17 డీలర్‌షిప్‌ కేంద్రాలున్నాయి.

భారత్‌ వాటా 57 శాతం

ఎలక్ట్రిక్‌ ఆటోల విక్రయాల్లో ప్రస్తుతం మన దేశం అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన విద్యుత్‌ ఆటోల్లో భారత్‌ వాటా 57 శాతం వరకు ఉంది. 2023లో దేశంలో అమ్ముడైన ఆటోల్లో 7.6 శాతం మాత్రమే ఈవీ ఆటోలది. ఈ ఏడాది ఇప్పటికే 32.8 శాతానికి చేరింది. ఏటా 30 శాతానికి పైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. 2030 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అంచనా. సానుకూల ఆర్థిక పరిస్థితులు, తగ్గుతున్న నిర్వహణ ఖర్చులు, ఫేమ్‌-2, పీఎం ఈ-డ్రైవ్‌ వంటి ప్రభుత్వ విధానాలు దేశంలో విద్యుత్‌ ఆటోల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతున్నాయి.


మాదే అగ్రస్థానం

2018 నుంచే మేం ఈ మార్కెట్లో ఉన్నాం. ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా ఈవీ త్రీ వీలర్స్‌ను విక్రయించాం. త్రీ వీలర్స్‌ మార్కెట్లో ఈవీల వాటా 33 శాతానికి చేరడంలో మాది కీలక పాత్ర. ప్రస్తుతం స్టార్ట్‌ప్సతో పాటు అనేక కంపెనీలు ఈ మార్కెట్లో ఉన్నాయి. గట్టి పోటీ ఉన్నప్పటికీ 37.6 శాతం వాటాతో మార్కెట్లో మహీంద్రా లాస్ట్‌ మైల్‌ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది సంస్థ అమ్మకాలు 47 శాతం పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈవీ త్రీ వీలర్‌ విక్రయాలు ఆరు రెట్లకు పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.

ఈవీలే ఎందుకంటే..

విద్యుత్‌ త్రీ వీలర్‌ మార్కెట్లో అధిక స్పేస్‌, కంఫర్ట్‌, ఖర్చులపరంగా మహీంద్రా ఈవీలకు మంచి పేరుంది. వాహన కొనుగోలుదారులకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు విశ్వసనీమైన, నాణ్యమైన సేవలు, బెస్ట్‌ వారెంటీ, దేశవ్యాప్తంగా 800కు పైగా సర్వీస్‌ టచ్‌ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఉదయ్‌ నెక్ట్స్‌ పథకం కింద ప్రతి ఈవీ ఈవీ కొనుగోలుదారుడికి రూ.20 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం.

10,000పైగా చార్జింగ్‌ పాయింట్స్‌

మహీంద్రాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,000కు పైగా చార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ‘మహీంద్రా నేమో’ యాప్‌ ద్వారా ఈ చార్జింగ్‌ పాయింట్లను గుర్తించవచ్చు. వీటికి తోడు మహీంద్రా త్రీ వీలర్‌ ఈవీలను ఇంటి వద్దే 16ఏ సాకెట్‌ సాయంతో మొబైల్‌ ఫోన్‌ను చార్జింగ్‌ చేసుకున్నట్టు చార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి తోడు ప్రధాన పట్టణాలు, నగరాల్లో పార్కింగ్‌, చార్జింగ్‌ సమస్యలను అధిగమించేందుకు వివిధ చార్జింగ్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం.


2030 నాటికి 10కి పైగా దేశాలకు ఎగుమతులు

ప్రస్తుతం మహీంద్రా.. జపాన్‌, గ్వాటెమాలా, యూకే, నేపాల్‌, బ్రెజిల్‌, శ్రీలంక దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ప్రస్తుతం ఎగుమతుల వాటా ఓ మోస్తరుగా ఉంది. 2030 నాటికి ఎగుమతులను 10కి పైగా దేశాలకు విస్తరించటం ద్వారా ఈ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఏడుకు పైగా మోడళ్లు

ప్రస్తుతం మహీంద్రా లాస్ట్‌ మైల్‌ పోర్టుఫోలియోలో ఏడుకు పైగా సరుకు (కార్గో) రవాణాతో పాటు ప్యాసింజర్‌ ఆటో మోడళ్లు ఉన్నాయి. ప్యాసింజర్‌ ఈవీకి సంబంధించి ట్రియో, ట్రియో ప్లస్‌ మోడల్స్‌ ఉండగా కార్గో ఈవీ కోసం ట్రియో జోర్‌, జోర్‌ గ్రాండ్‌ పేరుతో ఆటోలను విక్రయిస్తున్నాం. ఈ-రిక్షా విభాగంలో ట్రియో యారీ, ట్రియో యారీ కార్గో, ఈ-ఆల్ఫా ప్లస్‌ ప్యాసింజర్‌, ఈ-ఆల్ఫా కార్గో వెర్షన్స్‌ ఉన్నాయి. రెండు టన్నుల కంటే తక్కువ బరువు రవాణా చేసేందుకు గత ఏడాది మహీంద్రా జియో పేరుతో ప్రత్యేక ఫోర్‌ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేశాం. త్వరలోనే మార్కెట్లోకి కొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న మోడల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసేందుకు భారీగానే పెట్టుబడులు పెడుతున్నాం. దీనివల్ల మా ఈవీల సామర్ధ్యం పెరుగుతుంది.

అడ్డంకులున్నాయ్‌..

చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు పరిమిత స్థలాలు మాత్రమే అందుబాటులో ఉండడం, పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే అధిక ధర, నియంత్రణల గందరగోళం, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అవసరమైన విడిభాగాలు దేశీయంగా లభించకపోవటం ప్రధాన సమస్యలు. అయితే బ్యాటరీ సెల్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్‌ పథకం ద్వారా కృషి చేస్తుండటం సానుకూల అంశం.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 05:01 AM