Trumps Paracetamol Autism Link Claim: గర్భిణులకు పారాసిటమల్ డేంజరా? డోలో బ్రాండ్ అధినేత ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:06 AM
టైలెనాల్‌ను ఇండియాలో పారాసిటమల్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నొప్పులు, జ్వరానికి పారాసిటమల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇండియాలో క్రోసిన్, కాల్పాల్, డోలో 650 బ్రాండ్లను జనం అధికంగా ఉపయోగిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టైలెనాల్’పై చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు టైలెనాల్ వాడటం వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. టైలెనాల్‌ను ఇండియాలో పారాసిటమల్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నొప్పులు, జ్వరానికి పారాసిటమల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇండియాలో క్రోసిన్, కాల్పాల్, డోలో 650 బ్రాండ్లను జనం అధికంగా ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో డోలో అత్యంత ప్రాచూర్యం పొందింది.
డోలో బ్రాండ్ పేరు కాగా.. అందులో వాడే కెమికల్ ఫార్ములా మాత్రం ‘పారాసిటమల్’. పారాసిటమల్‌కు ఆటిజానికి సంబంధం ఉందంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు డోలో బ్రాండ్‌పై కూడా చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే డోలో ట్యాబ్లెట్లు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిలిప్ సూరన స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసిటమల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆటిజం వస్తుందనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిందని చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసిటమల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆటిజం వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పిందని అన్నారు. సైంటిస్టులు దీనిపై లోతైన పరిశోధనలు చేశారని, పారాసిటమల్‌కు ఆటిజానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారని చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే తల్లితో పాటు కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలని సూచించారు.
భారతీయ మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని, డాక్టర్లు కూడా సురక్షితమైన మందుల్ని మాత్రమే గర్భిణులకు సూచిస్తున్నారని వెల్లడించారు. పారాసిటమల్‌ను ఎలా పడితే అలా వాడటానికి లేదని, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. తమకు తల్లీ,బిడ్డల క్షేమమే ముఖ్యమని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాలిఫోర్నియాలో ఆర్య వైద్య కళాశాలకు శంఖుస్థాపన
బస్సులో అలజడి.. సుత్తెతో ప్రయాణికులపై దాడి చేసిన సైకో..