JP Morgan Predicts On Crude Oil: 30 డాలర్లకు ముడిచమురు
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:18 AM
రాబోయే సంవత్సరాల్లో ముడిచమురు దిగుమతుల భారం నుంచి భారత్‌కు, ఇంధన ధరల పోటు నుంచి వాహనాదారులకు భారీ ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 60 డాలర్ల ఎగువన...
డిమాండ్‌ను మించిపోనున్న సరఫరా
జేపీ మోర్గాన్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాల్లో ముడిచమురు దిగుమతుల భారం నుంచి భారత్‌కు, ఇంధన ధరల పోటు నుంచి వాహనాదారులకు భారీ ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 60 డాలర్ల ఎగువన కదలాడుతున్న బ్యారెల్ ముడిచమురు ధర.. క్రమంగా తగ్గుముఖం పట్టనుందని, 2027 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 30 డాలర్ల స్థాయికి దిగిరావచ్చని ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా నివేదిక అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్లోకి ముడిచమురు సరఫరా గణనీయంగా పెరగనుందని, మార్కెట్ డిమాండ్‌ను మించిపోనుందని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, గుయానా వంటి ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య) ప్లస్ యేతర దేశాలు చమురు ఉత్పత్తిని భారీగా పెంచవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని యథాతథం గా కొనసాగిస్తే, రెండేళ్లలో ఇంధన సరఫరా మిగులు రోజుకు 30 లక్షల బ్యారెళ్లకు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. దాంతో ధరలు ప్రస్తుత స్థాయితో పోలిస్తే, దాదాపు సగానికి తగ్గేందుకు అవకాశాలున్నాయని అంటోంది.
మనకు అన్ని విధాలా ప్రయోజనకరమే : ప్రపంచంలో అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. పైగా, దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. కాబట్టి, ముడిచమురు ధరలు తగ్గుదల భారత్‌కు అన్ని విధాలా ప్రయోజనకరమే. దేశ దిగుమతుల వ్యయంతో పాటు కరెంట్ ఖాతా లోటు తగ్గుదలకు ఇది దోహదపడుతుంది. వాహనదారులపై పెట్రోల్, డీజిల్ కొనుగోలు భారం తగ్గుతుంది. సరుకు రవాణా వ్యయం కూడా తగ్గి ధరలు మరింత దిగివచ్చేందుకు తోడ్పడుతుంది. ఎయిర్‌లైన్స్, కెమికల్స్, టాన్స్‌పోర్ట్ రంగ వ్యాపార నిర్వహణ వ్యయమూ గణనీయంగా తగ్గుతుంది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!