Share News

గృహ రుణం తీసుకుంటున్నారా

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:48 AM

ప్రతి వ్యక్తికి సొంతింటిపై ఆశ ఉంటుంది. అయితే కొద్దిమందికి మాత్రమే అప్పు చేయకుండా సొంతిల్లు సమకూర్చుకునే ఆర్థిక స్థోమత ఉంటుంది. మిగతా వారు బ్యాంకులు లేదా గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)ల నుంచి ఎంతో కొంత అప్పు...

గృహ రుణం తీసుకుంటున్నారా

ప్రతి వ్యక్తికి సొంతింటిపై ఆశ ఉంటుంది. అయితే కొద్దిమందికి మాత్రమే అప్పు చేయకుండా సొంతిల్లు సమకూర్చుకునే ఆర్థిక స్థోమత ఉంటుంది. మిగతా వారు బ్యాంకులు లేదా గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)ల నుంచి ఎంతో కొంత అప్పు చేయాల్సిందే. అయితే ఇక్కడ వడ్డీ రేటు విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే వడ్డీల మీద వడ్డీలు చెల్లించలేక ఆపసోపాలు పడాలి.

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అప్పు చేసి సొంతిల్లు సమకూర్చుకోవడం మరింత కష్టం. అనేక షరతులకు ఒప్పుకుంటే గాని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు హోమ్‌ లోన్లు ఇవ్వవు. ఈ ఇచ్చే చలన (ఫ్లోటింగ్‌) వడ్డీ రేటు రుణాలపై మూడు ప్రామాణికాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారు. అవేంటంటే ?

రెపో ఆధారిత వడ్డీ రేటు

ఈ వడ్డీ రేటు బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇచ్చే స్వల్పకాలిక వడ్డీ రేటు.. ‘రెపో రేటు’పై ఆధారపడి ఉంటుంది. ఈ రెపో రేటుకు మరికొద్దిగా కలుపుకుని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు గృహ రుణాల వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటు సవరించినప్పుడల్లా మూడు నెలల్లోగా ఈ రుణాల వడ్డీ రేటును సవరిస్తారు. అయితే ఇటీవల చాలా బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వారం పది రోజుల్లోనే ఆ లాభాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేస్తున్నాయి.

ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలు

గత ఏడాది కాలంలో సమీకరించిన నిధులపై చెల్లించే వడ్డీ రేటు ఆధారంగా బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు ఈ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. రెపో ఆధారిత రుణాలతో పోలిస్తే ఈ రుణాలపై వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువే. నిధుల సమీకరణ వడ్డీ రేటు తగ్గినా బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు రుణగ్రస్తులకు ఆ ప్రయోజనాన్ని బదిలీ చేసేందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు గడువు తీసుకుంటాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రుణాల జోలికి పోకపోవడమే మంచిది.

కనీస వడ్డీ రేటు

ప్రతి బ్యాంకుకు ఒక కనీస వడ్డీ రేటు (పీఎల్‌ఆర్‌) ఉంటుంది. దీనికి మరికొంత కలుపుకుని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు గృహ రుణాలు ఇస్తాయి. దేశంలో వడ్డీ రేట్లు తగ్గినా, పీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలా? వద్దా? ఒకవేళ తగ్గించినా ఎపుడు? ఎంత మేరకు తగ్గించాలి? అనేది పూర్తిగా ఆయా బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితి

చలన వడ్డీ (ఫ్లోటింగ్‌) రేట్లన్నీ రెపో వంటి ఏదో ఒక ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారంగా ఉండాలని ఆర్‌బీఐ 2019లో బ్యాంకులను ఆదేశించింది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం గత ఏడాది డిసెంబరు నాటికి మొత్తం గృహ రుణాల్లో 60.4 శాతం రెపో రేటు ఆధారితంగా ఉండగా.. 35.6 శాతం రుణాలు ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలు, రెండు శాతం రుణాలు మాత్రమే పీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలని తేలింది.


వడ్డీ రేటు నిర్ణయం

బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు పూర్తిగా పైన పేర్కొన్న ప్రామాణిక వడ్డీ రేట్లపైనే గృహ రుణాలు ఇవ్వవు. వాటికి మరికొంత శాతం కలుపుకుని మాత్రమే రుణాలు ఇస్తాయి. ఈ అదనపు మొత్తం ఎంత? అనేది రుణ మొత్తం, రుణ గ్రహీత పరపతి స్కోరు, రుణ చెల్లింపు కాలవ్యవధి ఆధారంగా నిర్ణయిస్తారు.

ప్రస్తుతం దేశంలో వడ్డీ రేట్లు దిగొస్తున్నాయి. ఈ సంవత్సరం ఆర్‌బీఐ ఇప్పటి వరకు కీలక రెపో వడ్డీ రేటును ఒక శాతం కుదించింది. బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలూ వారం పది రోజుల్లోనే ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. మంచి పరపతి స్కోరు ఉన్న వారికి బ్యాంకులు ప్రస్తుతం 8 శాతం కంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొలిక్కి వచ్చి ధరల సెగ లేకపోతే దేశంలో వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశమే తప్ప పెరిగే అవకాశం లేదన్నది నిపుణుల అంచనా. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గృహ రుణాలు తీసుకునే వ్యక్తులు ఎంసీఎల్‌ఆర్‌, పీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేట్లకు బదులు రెపో ఆధారిత వడ్డీ రేట్లను ఎంచుకోవడమే మంచిది.


ఏది మంచిది?

ఎంత ఆదా?

ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌, పీఎల్‌ఆర్‌ ఆధారిత గృహ రుణాలపై బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు 9 శాతానికి పైగానే వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వ్యక్తులకు కొన్ని బ్యాంకులు 7.35 శాతం వడ్డీ రేటుకే రెపో ఆధారిత గృహ రుణాల ఇస్తున్నాయి. ఈ లెక్కన 20 ఏళ్లలో చెల్లించేలా 9.25 శాతం వడ్డీ రేటుతో ఒక వ్యక్తి రూ.55 లక్షల ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత గృహ రుణం తీసుకున్నాడనుకుందాం. దీనిపై అతడు నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.50,372. అదే 7.35 శాతం రెపో ఆధారిత వడ్డీ రేటుతో అదే కాలపరిమితితో తీసుకునే రూ.55 లక్షల గృహ రుణంపై చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,084 మాత్రమే. అంటే నెలకు రూ.6,500 చొప్పున 20 ఏళ్లలో రూ.15.76 లక్షల వడ్డీ ఆదా అవుతుంది.

తేడానే కీలకం

రెపో ఆధారిత గృహ రుణాల్లోనూ కొన్ని మతలబులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు రెపో రేటు కంటే 3-4 నాలుగు శాతం అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ అధిక మొత్తాన్నే స్ర్పెడ్‌ (తేడా) అంటారు. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లేకపోతే రెపో రేటు తగ్గినా రుణ గ్రహీతలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.

మార్గం ఎంటి?

రెపో, ఎంసీఎల్‌ఆర్‌, పీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే వాటిని కనీస స్థాయికి తగ్గించమని గృహ రుణాలు ఇచ్చిన బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలను అడగాలి. అందుకు అవి అంగీకరిస్తే సరే. లేకపోతే మీ గృహ రుణాన్ని కనీస రెపో ఆధారిత గృహ రుణం ఇచ్చే బ్యాంకుకు మార్చుకోవడం మంచిది. అయితే ఆ వడ్డీ రేటు తగ్గింపు కనీసం 1 నుంచి 2 శాతమైనా ఉండాలి. లేకపోతే ఈ పోర్టబిలిటీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:48 AM