Share News

China Allows Indian Pharma: చైనాకి భారత జనరిక్‌ ఔషధాలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:06 AM

ఇన్నాళ్లూ భారత ఔషఽధ కంపెనీలకు ప్రవేశం నిరాకరించిన చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. భారత ఔషధాలకు ముఖ్యంగా జనరిక్‌ ఔషధాలకు తలుపులు తెరుస్తోంది. అయితే ఈ అవకాశాన్ని భారత...

China Allows Indian Pharma: చైనాకి భారత జనరిక్‌ ఔషధాలు

నాట్కో, హెటెరో, రెడ్డీస్‌కీ అవకాశం

ఫలిస్తున్న ప్రభుత్వ ఒత్తిడి

బీజింగ్‌: ఇన్నాళ్లూ భారత ఔషఽధ కంపెనీలకు ప్రవేశం నిరాకరించిన చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. భారత ఔషధాలకు ముఖ్యంగా జనరిక్‌ ఔషధాలకు తలుపులు తెరుస్తోంది. అయితే ఈ అవకాశాన్ని భారత ఫార్మా కంపెనీలకు చెందిన చైనా అనుబంధ కంపెనీలకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేసింది. గత నెల చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక టెండర్‌లో చైనాలోని సిప్లా, నాట్కో ఫార్మా, హెటెరో ల్యాబ్స్‌, అన్నోర ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వంటి భారత ఔషధ కంపెనీల అనుబంధ సంస్థలు ప్రభుత్వ నిర్వహణలోని ఆస్పత్రులకు తమ జనరిక్‌ ఔషధాలను సరఫరా చేసే కాంట్రా క్టు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగా సిప్లాతో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే నాట్కో ఫార్మా, అన్నోర ఫార్మా, హెటరో ల్యాబ్స్‌ వంటి ఏడు భారత ఫార్మా కంపెనీల అనుబంధ సంస్థలు మధుమేహ నియంత్రణకు వాడే ‘డపాగ్లిఫ్లోజిన్‌’ అనే జనరిక్‌ టాబ్లెట్లను 100 కోట్ల వరకు చైనాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయబోతున్నాయి.

వీబీపీ పద్దతిలో : చైనా ప్రభుత్వం వాల్యూమ్‌ బేస్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (వీబీపీ) పద్దతిలో ఈ ఔఽషధాలను కొనుగోలు చేస్తోంది. ఈ పద్దతిలో తక్కువ ధర కోట్‌ చేసి ఎంపికైన ఫార్మా కంపెనీలు చైనాలోని నిర్దేశిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తమ జనరిక్‌ ఔషధాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అన్నోరా ఫార్మా, నాట్కో ఫార్మా కంపెనీల చైనా అనుబంధ కంపెనీలు కూడా ఈ బిడ్‌లో పాల్గొని ఆక్స్‌కార్బాజెపైన్‌, ఒలాపారిబ్‌ టాబ్లెట్లు సరఫరా చేసే కాంట్రాక్టు సంపాదించాయి. ఈ రెండు టాబ్లెట్లను మూర్చ వ్యాధి, కొన్ని రకాల కేన్సర్‌ చికిత్సలో ఉపయోగిస్తారు. చైనాలోని డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ అనుబంధ సంస్థ కున్షన్‌ రోటం రెడ్డి ఫార్మాస్యూటికల్‌ కంపెనీ కూడా నాలుగు రకాల జనరిక్‌ ఔషధాలకు చైనాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయనుంది. ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు, అలెర్జీల వంటి రుగ్మతల చికిత్సలో ఈ ఔషధాలను ఉపయోగిస్తారు.


ఫలిస్తున్న ఒత్తిడి: గత ఏడాది చైనా ఔషధ మార్కెట్‌ 25,237 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.22.37 లక్షల కోట్లు) నమోదైంది. ఇందులో బహుళ జాతి కంపెనీలు, స్థానిక కంపెనీలదే హవా. దీనికి తోడు వీబీపీ పద్దతిలో కొనే ఔషధాలకు చైనా ప్రభుత్వం అతి తక్కువ ధర నిర్ణయిస్తోంది. దీంతో ఇప్పటి వరకు భారత ఫార్మా కంపెనీలు చైనా మార్కెట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. చైనా అనుసరిస్తున్న వాణిజ్యేతర రక్షణ విధానాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే వీబీపీ పద్దతిలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఔషధాలు కొనుగోలు చేయడం భారత ఫార్మా కంపెనీలను ఆకర్షిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాకు పెరిగిపోతున్న మిగులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో మీ ఫార్మా మార్కెట్‌ను మా కంపెనీలకు తెరుస్తారా...లేదా లేకపోతే మేము కూడా మీ కంపెనీలకు దడి కట్టాల్సి వస్తుందని కేంద్రప్రభుత్వం చైనాను హెచ్చరిస్తోంది. దీంతో చైనా తన దేశంలోని భారత ఫార్మా అనుబంధ కంపెనీలను మాత్రమే తన ప్రభుత్వ ఆస్పత్రులకు జనరిక్‌ ఔషధాలు సరఫరా చేసేందుకు పాక్షికంగా అనుమతించిందని భావిస్తున్నారు.

రూ.10,096 కోట్ల మార్కెట్‌

వీబీపీ పద్దతిలో చైనా ప్రభుత్వం ఏడు రకాల జనరిక్‌ ఔషధాలను కొనుగోలు చేయనుంది. ఇందులో మధుమేహ నియంత్రణకు వాడే ‘డపాగ్లిఫ్లోజిన్‌’ జనరిక్‌ టాబ్లెట్ల మార్కెట్టే 114 కోట్ల డాలర్ల (సుమారు రూ.10,096 కోట్లు) వరకు ఉంది. ఇందులో గత ఏడాది 70 కోట్ల డాలర్ల విలువైన టాబ్లెట్లను చైనాలోని ప్రభుత్వ ఆస్పత్రులే కొనుగోలు చేశాయి.

ఇవి కూడా చదవండి:

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

Updated Date - Nov 12 , 2025 | 05:06 AM