Share News

సిమెంట్‌ రంగంలో మరిన్ని కొనుగోళ్లు

ABN , Publish Date - May 27 , 2025 | 02:55 AM

దేశీయ సిమెంట్‌ పరిశ్రమలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని మూడీస్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో తెలిపింది. చిన్న కంపెనీలే ఇందుకు లక్ష్యమవుతాయని పేర్కొంది. గత ఐదేళ్లలో టాప్‌-10 కంపెనీలు రూ.89,000 కోట్ల పెట్టుబడితో...

సిమెంట్‌ రంగంలో మరిన్ని కొనుగోళ్లు

మూడీస్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్‌ పరిశ్రమలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని మూడీస్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో తెలిపింది. చిన్న కంపెనీలే ఇందుకు లక్ష్యమవుతాయని పేర్కొంది. గత ఐదేళ్లలో టాప్‌-10 కంపెనీలు రూ.89,000 కోట్ల పెట్టుబడితో 14 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాంతీయ చిన్న కంపెనీలను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. మార్కెట్‌పై పట్టు బిగించేందుకు అలా్ట్రటెక్‌, అంబుజా సిమెంట్‌ వంటి పెద్ద కంపెనీలు ఇక ముందు కూడా తక్కువ ఉత్పత్తి సామర్ధ్య వినియోగం, అరకొర లాభాలతో పని చేసే చిన్న చిన్న కంపెనీల కొనుగోళ్లు కొనసాగిస్తాయని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా. ఒక్క దక్షిణ భారతంలోనే ఇలాంటి చిన్న కంపెనీలు 70 వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

మరింత ఉత్పత్తి సామర్ధ్యం : పెరుగుతున్న గృహ నిర్మాణం, ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో 2030 వరకు దేశంలో సిమెంట్‌ గిరాకీ ఏటా ఆరు నుంచి ఏడు శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌ను తట్టుకునేందుకు కంపెనీలు వచ్చే ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరో 30 శాతం (20 కోట్ల టన్ను లు) పెంచాల్సి ఉంటుందని మూడీస్‌ స్పష్టం చేసింది. ఇందులో 17 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం 2028 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. 2030 నాటికి ఏర్పడే 20 కోట్ల అదనపు ఉత్పత్తి సామర్ధ్యంలో 30 శాతం (ఆరు కోట్ల టన్నులు) అలా్ట్రటెక్‌, అంబుజా సిమెంట్‌ కంపెనీల ద్వారానే అందుబాటులోకి రానుంది. మరో 25 శా తం ఉత్పత్తి శ్రీ సిమెంట్‌, దాల్మియా భారత్‌ కంపెనీల ద్వారా అందుబాటులోకి వస్తుందని అంచనా.


ధరలు మరింత పైకి : మరోవైపు సిమెంట్‌ కంపెనీలు ధరల పెంపు ప్రారంభించాయి. వారం పది రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్‌ బస్తా ధర కంపెనీని బట్టి రూ.310 నుంచి రూ.350 వరకు ఉండేది. ఇపుడది రూ.360 నుంచి రూ.400 పలుకుతోంది. గత రెండు నెలల్లో కంపెనీలు ధరలు పెంచడం ఇది రెండో సారి. ధరలు పెంచడంతో అమ్మకాలు మరింత తగ్గాయని రిటైల్‌ డీలర్లు చెబుతున్నారు. బస్తాసిమెంట్‌ ధర కనీసం రూ.400 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని కంపెనీలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:55 AM